Sisodiya: ఢిల్లీలో ఓడిన, గెలిచిన ప్రముఖులు వీరే!

by B.Srinivas |

ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.

Sisodiya: ఢిల్లీలో ఓడిన, గెలిచిన ప్రముఖులు వీరే!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై 4089 ఓట్లు మెజారిటీతో ఓడిపోయారు. పర్వేశ్ వర్మకు 30088 ఓట్లు పోలవ్వగా, కేజ్రీవాల్‌కు 25999 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి కేజ్రీవాల్ గతంలో మూడు సార్లు విజయం సాధించారు.

స్వల్ప ఓట్ల తేడాతో సిసోడియా

జంగ్ పుర అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish sisodiya) సైతం ఓడిపోయారు. అయితే సిసోడియా కేవలం 675 ఓట్ల తేడాతో పరాజయం పాలవడం గమనార్హం. ఆయన ప్రత్యర్థి బీజేపీ నేత తర్వీంధర్ సింగ్‌కు 38859 ఓట్లు పోలవ్వగా, సిసోడియాకు 38184 ఓట్లు వచ్చాయి. అలాగే ఆప్ కీలక నేతలు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్, సోమనాథ్ భారతి, దుర్గేష్ పాఠక్‌లు ఓడిపోయారు.

వివాదాస్పద నేత రమేశ్ బిధూరీ సైతం

ఎన్నికల్లో గెలిస్తే తన నియోజకవర్గంలోని రోడ్లన్నింటినీ ప్రియాంక గాంధీ చెంపల్లా చేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేశ్ బిధూరీ (Ramesh bidhuri) ఓడిపోయారు. కల్కజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన 3521 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

సీఎం అతిశీ విజయం

ఆప్ కీలక నేతలు ఓడిపోయినప్పటికీ ఢిల్లీ సీఎం అతిశీ (Athishi) మాత్రం గెలుపొందారు. కల్కజీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన ఆమె బీజేపీ నేత రమేశ్ బిధూరీపై 3521 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అతిశీకి 52154 ఓట్లు రాగా, బిధూరీకి 48633 ఓట్లు వచ్చాయి.

పర్వేశ్ వర్మ

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై పోటీ చేసిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ (Parvesh varma) విజయం సాధించారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆయన 4089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే బీజేపీ కీలక నేతలు కైలీశ్ గెహ్లాట్, అర్విందర్ సింగ్ లవ్లీ, రాజ్ కుమార్ బాటియా, పూనమ్ శర్మ, సతీశ్ ఉపాధ్యాయ్‌లు సైతం గెలుపొందారు.

Next Story