Supreme Court: ఆమెమీ చిన్నపిల్ల కాదు.. ఒకే చేతిలో చప్పట్లు మోగవు- సుప్రీంకోర్టు

by Shamantha N |

లైంగిక వేధింపుల కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్‌లు బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మహిళపై కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: ఆమెమీ చిన్నపిల్ల కాదు.. ఒకే చేతిలో చప్పట్లు మోగవు- సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్‌లు బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మహిళపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ మహిళ "చిన్నపిల్ల ఏం కాదు" ఒక చేయితో చప్పట్లు మోగవు అని పేర్కొంది. "ఒకే చేయితో చప్పట్లు మోగవు. మీరు ఏ ప్రాతిపదికన ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. ఆమె చిన్నపిల్లేమీ కాదు. ఆ మహిళ వయస్సు 40 సంవత్సరాలు. వారు కలిసి జమ్మూకు వెళ్లారు. మీరు ఆ కేసు ఎందుకు పెట్టారు. ఈ మహిళ జమ్ముకు ఏడుసార్లు వెళ్లినా ఆమె భర్తకు పట్టింపు ఉండదా?" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడు తొమ్మిది నెలలుగా జైలులో ఉన్నాడని.. ఈ కేసులో అభియోగాలు మోపలేదు కాబట్టి ఇది మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి తగిన కేసు అని పేర్కొంది. అంతేకాకుండా, నిందితుడిపైనా విమర్శలు గుప్పించింది. అలాంటి వ్యక్తుల వల్ల ఎవరు ప్రభావితమవుతారు అని ప్రశ్నించింది. నిందితుడ్ని ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని.. నిబంధనలు, షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, నిందితుడు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని పేర్కొంది. బాధిత మహిళను సంప్రదించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని ధర్మాసనం పేర్కొంది.

కేసు ఏంటంటే?

పోలీసుల ఫిర్యాదు ప్రకారం, ఓ మహిళ తన దుస్తుల బ్రాండ్‌ కోసం 2021లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ సాయం కోరింది. అలా వారి పరిచయం ఏర్పడింది. కంటెంట్ కోసం ఐఫోన్ ఇవ్వాలని మహిళను నిందితుడు కోరాడు. దీంతో, ఆమె జమ్మూలోని అధీకృత ఆపిల్ స్టోర్ లో అతడికి మొబైల్ కొనిచ్చింది. అయితే, నిందితుడు పరికరాన్ని తిరిగి అమ్మడానికి ప్రయత్నించిన తర్వాత వారి వృత్తిపరమైన సంబంధం దెబ్బతింది. దీంతో, ఆమెకు అతడు డబ్బులు తిరిగి చెల్లించాడు. కానీ, రూ.20 వేలు తక్కువగా ఇచ్చారు. అయితే, డిసెంబర్ 2021లో, ఆ వ్యక్తి ఆ రూ. 20,000 తిరిగి ఇచ్చి క్షమాపణ చెప్పడానికి నోయిడాలోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్‌లో జరిగే బ్రాండ్ షూట్ కోసం ప్రయాణించమని ఆమెను ఒప్పించాడు. దారిలో ఉండగా నిందితుడు ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన స్వీట్లు ఇచ్చాడని దీంతో, స్పృహ కోల్పోయిందని మహిళ ఆరోపించింది. ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, పర్సు, డబ్బు దొంగిలించి, అసభ్యకర చిత్రాలు తీశాడని ఆరోపించింది. ఆ తర్వాత, ఆ మహిళను జమ్మూకు వెళ్లమని బలవంతం చేశాడని, అక్కడ రెండున్నర సంవత్సరాలుగా ఆమెపై లైంగిక వేధింపులు, దోపిడీకి పాల్పడ్డాని ఫిర్యాదులో తెలిపింది. దీంతో, అతడిపై కేసు నమోదు అయ్యింది.

Next Story