సింగర్ జుబిన్ గార్గ్‌ను హత్య చేశారు.. అసెంబ్లీ వేదికగా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటన

by Malleboina Mahesh |

అస్సాం ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ సింగపూర్‌లో ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణంపై మొదటి నుంచి అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.

సింగర్ జుబిన్ గార్గ్‌ను హత్య చేశారు.. అసెంబ్లీ వేదికగా సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ (Singer Zubin Garg) సింగపూర్‌లో ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణంపై మొదటి నుంచి అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో స్థానిక ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. కాగా ఈ రోజు సింగర్ జుబిన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Chief Minister Himanta Biswa Sarma) అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. 52 ఏళ్ల జుబిన్ గార్గ్‌ ప్రమాదవశాత్తు మరణించలేదని, ఆయన హత్యకు గురయ్యారని సీఎం హిమంత స్పష్టం చేశారు. ఇటీవల జుబిన్ సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలు వెలువడగా, ఆయన కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. పోలీసుల విచారణలో భాగంగానే ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా అస్సాంలో ఈ కేసుపై తీవ్ర సంచలనం నెలకొంది.

ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తులో జుబిన్ గార్గ్ మరణం వెనుక ఉన్న మిస్టరీ క్రమంగా వీడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తుల నుంచి లభించిన ఆధారాల ఆధారంగానే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ కీలక ప్రకటన చేశారని రాజకీయ, మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జుబిన్ గార్గ్ అస్సామీ సంగీతంలో ఒక లెజెండరీ స్థానం ఉన్నందున, ఆయన హత్యకు గురయ్యారన్న వార్త అభిమానులను తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు వివరాలు, హత్య వెనుక ఉన్న ఉద్దేశాలు మరియు నిందితులు ఎవరు అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story