Shubhanshu Shukla: ఢిల్లీ చేరుకున్న శుభాంశు శుక్లా

by S Gopi |

శుక్లాతో పాటు మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన వ్యోమగాముల్లో ఒకరైన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా స్వదేశానికి తిరిగి వచ్చారు.

Shubhanshu Shukla: ఢిల్లీ చేరుకున్న శుభాంశు శుక్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం భారత్‌కు తిరిగివచ్చారు. గతేడాది కాలంగా ఐఎస్ఎస్‌కు ఆక్సియం-4 మిషన్ కోసం అమెరికాలో శిక్షణ తీసుకున్న శుక్లాకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ స్వాగతం పలికారు. శుక్లాతో పాటు మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన వ్యోమగాముల్లో ఒకరైన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా స్వదేశానికి తిరిగి వచ్చారు. శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకోవడం భారత్‌కు గర్వకారణమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇస్రోకు ఎంతో కీర్తిని అందించిన, దేశ అంతరిక్ష వైభవాన్ని అందించిన శుభాంశు శుక్లా భారత గడ్డను తాకారు. ఆయనతో పాట్ మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారని కేంద్రమంత్రి జితేంద్ర సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంతకుముందు శనివారమే శుభాంశు శుక్లా భారత్‌కు వస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మిషన్ గగన్‌యాన్ కోసం కుటుంబసభ్యులు, స్నేహితులకు దూరంగా ఉన్నానని, వారిని కలిసి తన అనుభవాలను పంచుకునేందుకు ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు.

భారత్ చేరుకున్న శుభాంశు శుక్లా, శొమవారం ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన స్వస్థలం లక్నోకు వెళ్లనున్నారు. ఆగస్టు 22-23 తేదీల్లో జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆయన మళ్లీ ఢిల్లీకి చేరుకుంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా టీమ్ అంతరిక్షంలో 18 రోజులు గడిపి వివిధ ప్రయోగాలను నిర్వహించింది. జూలై 18న భూమిపైకి తిరిగి వచ్చిన వ్యోమగాములు, అప్పటినుంచి క్వారంటైన్‌లో ఉన్నారు.

Next Story