- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాప్‌కీపర్ సమయస్ఫూర్తితో దక్కిన ప్రాణం.. 4వ అంతస్తు నుంచి దూకిన యువతి
ఢిల్లీలోని విశ్వాస్ నగర్‌లో ఓ యువతి ప్రాణాలు తృటిలో తప్పాయి. హోటల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించిన ఆమెను, ఒక షాప్‌కీపర్ తన సమయస్ఫూర్తితో మృత్యువు నుంచి కాపాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీలోని విశ్వాస్ నగర్‌లో ఓ యువతి ప్రాణాలు తృటిలో తప్పాయి. హోటల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించిన ఆమెను, ఒక షాప్‌కీపర్ తన సమయస్ఫూర్తితో మృత్యువు నుంచి కాపాడారు. ఏం జరిగిందంటే? శుక్రవారం ఢిల్లీలోని సుందర్ నగరి ప్రాంతానికి చెందిన ఒక 20 ఏళ్ల యువతి.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌కు చెందిన తన 22 ఏళ్ల యువకుడితో కలిసి శుక్రవారం తూర్పు ఢిల్లీలోని 'హోటల్ సంతోష్ రెసిడెన్సీ'కి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ నేపథ్యంలో మనస్తాపానికి గురైన యువతి, హోటల్ నాలుగో అంతస్తులోని కిటికీ నుండి కిందకు దూకేసినట్లు జాతీయ మీడియా తెలిపింది.
ప్రాణం పోసిన కార్డ్‌బోర్డ్ పెట్టెలు..
యువతి కిటికీ అంచున నిలబడి కిందకు దూకబోతుండటాన్ని గమనించిన సమీపంలోని ఓ షాప్‌కీపర్, క్షణాల్లో స్పందించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన దుకాణంలో ఉన్న టీవీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల భారీ కార్డ్‌బోర్డ్ పెట్టెలను (Cardboard boxes) ఆమె పడే అవకాశం ఉన్న చోట వరుసగా పేర్చారు. యువతి పైనుండి నేరుగా ఆ ఖాళీ పెట్టెలపై పడటంతో, కింద నేలకు తగిలే ప్రభావం (Impact) తగ్గి ప్రాణాపాయం తప్పింది.
పోలీసుల విచారణ..
సమాచారం అందుకున్న ఫర్ష్ బజార్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యువతితో పాటు ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఒక చిన్న ఆలోచన, తక్షణ స్పందన ఒక నిండు ప్రాణాన్ని కాపాడటంతో, స్థానిక ప్రజలు, నెటిజన్లు ఆ షాప్‌కీపర్ ‘Presence of Mind’ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.






