- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్డ్ జడ్జి కోడలు మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. బయటపడ్డ చివరి ఇన్‌స్టా మెసేజ్
రిటైర్డ్ జడ్జి కోడలు ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రిటైర్డ్ జడ్జి కోడలు ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ట్విషా తన స్నేహితురాలితో ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది. మరోవైపు, తమకు న్యాయం చేయాలని, ట్విషా మృతదేహానికి భోపాల్‌లో కాకుండా ఢిల్లీ ఎయిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం భోపాల్‌లోని ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.
ఆందోళన పెంచుతున్న ఇన్‌స్టా చాట్..
మరణానికి ముందు ట్విషా తన స్నేహితురాలు మీనాక్షితో ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన సంభాషణలు తాజాగా బయటపడ్డాయి. అందులో పెళ్లి చేసుకోవద్దంటూ స్నేహితురాలిని ఆమె హెచ్చరించడం గమనార్హం. ట్విషా చాట్ ప్రకారం.. ‘నేను ఇరుక్కుపోయా బ్రో.. బస్ తూ మత్ ఫస్నా (నువ్వు మాత్రం ఆ ఉచ్చులో పడకు). ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేను. సరైన సమయం వచ్చినప్పుడు నేనే కాల్ చేస్తాను.’ అని పేర్కొంది. ఆ మెసేజ్‌కు మీనాక్షి రిప్లై.. ‘నీ పరిస్థితి చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంది టుక్ టుక్.. ఐ లవ్ యూ సో మచ్.’ అని చాట్‌లో ఉంది.
సీఎం నివాసం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ట్విషా కుటుంబ సభ్యులు భోపాల్‌లోని సీఎం నివాసం గేటు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని వారు పట్టుబట్టారు. ముఖ్యమంత్రికి వారి ఫిర్యాదును అందజేస్తామని సీఎం కార్యాలయ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో శ్యామల హిల్స్ పోలీసు అధికారుల బృందం అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసింది.
కుటుంబ సభ్యుల ప్రధాన డిమాండ్లు, ఆరోపణలు..
ట్విషా అత్తమామలకు భోపాల్ ఎయిమ్స్‌లో పనిచేసే పలువురితో పరిచయాలు ఉన్నాయని, కాబట్టి స్థానికంగా జరిగే విచారణ, పోస్టుమార్టం రిపోర్టులపై తమకు నమ్మకం లేదని వారు ఆరోపించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోనే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పోస్టుమార్టం (షార్ట్ పోస్టుమార్టం) నివేదికలో ఆమె ఉరివేసుకోవడం వల్లే మరణించిందని ఉన్నప్పటికీ, ట్విషా శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, నిష్పాక్షిక విచారణ జరపాలని వారు కోరుతున్నారు. ట్విషా అత్తమామలు మృతదేహాన్ని అడిగినప్పటికీ, వారికి అప్పగించేందుకు ఆమె కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. కాగా, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ కుమారుడు సమర్థ్ సింగ్‌తో గత ఏడాది (2025) డిసెంబర్ 12న ట్విషా శర్మ వివాహం జరిగింది. వీరు కటారా హిల్స్ ప్రాంతంలోని బాగ్ ముగలియా ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉంటున్నారు. వివాహమైనప్పటి నుంచే భర్త, అత్త కలిసి ట్విషాను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మే 12వ తేదీ రాత్రి ట్విషా టెర్రస్‌పై ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది.






