ఒడిశాలో కాంగ్రెస్, బీజేపీలకు షాక్: బీజేడీలో చేరిన సీనియర్ నేతలు

by Dishanational2 |
ఒడిశాలో కాంగ్రెస్, బీజేపీలకు షాక్: బీజేడీలో చేరిన సీనియర్ నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒడిశాలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రెండు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బిజూ జనతాదళ్ (బీజేడీ)లో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే సుకాంత నాయక్, కాంగ్రెస్ సీనియర్ నేత చిరంజిబ్ బిస్వాల్‌లు బీజేడీలో జాయిన్ అయ్యారు. భువనేశ్వర్‌లోని బీజేడీ ప్రధాన కార్యాలయం శంఖభవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిని బీజేడీ నాయకులు ప్రతాప్ కేసరి, రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్రాలు పార్టీలోకి ఆహ్వానించారు. సుకాంత ఇటీవల బీజేపీకి రిజైన్ చేశారు. ప్రస్తుతం బీజేపీలో పరిస్థితులు అనుకూలంగా లేవని, బావోద్వేగంతో పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. నాయక్ 2014లో మొదటిసారి బీజేడీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే తిగిరి మళ్లీ బీజేడీ గూటికి చేరారు.

ఇక, చిరంజీబ్ బిస్వాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బసంత్ కుమార్ బిస్వాల్ కుమారుడు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. బిశ్వాల్‌తో పాటు కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ అజయ్ కేతన్ సమాల్, జోగేంద్ర బహుబలేంద్రలు కూడా బీజేడీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు బీజేడీని వీడిన కూచిండా మాజీ ఎమ్మెల్యే బృందాబన్ మాఝీ కూడా తిరిగి పార్టీలోకి వచ్చారు. మరోవైపు, బీజేడీ మాజీ ఎమ్మెల్యే కొరియా ఆకాష్ దాస్ నాయక్ బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ మన్‌మోహన్ సమల్ ఆధ్వర్యంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్టు ఆకాష్ ప్రకటించారు. కాగా, ఒడిశాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేడీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని భావించినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి.

Next Story

Most Viewed