Shashi: పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. పార్టీ మార్పు ఖాయమంటూ ఊహాగానాలు !

by B.Srinivas |

కాంగ్రెస్‌తో విభేదాలున్నాయని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పై కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Shashi: పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. పార్టీ మార్పు ఖాయమంటూ ఊహాగానాలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌తో విభేదాలున్నాయని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పై కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌(Piyush goyal) తో కలిసి సెల్ఫీ దిగిన ఫొటోను శశిథరూర్ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ (Jonathan Reynolds) కూడా ఉన్నారు. ‘భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బ్రిటన్ ప్రతినిధి జోనాథన్ రేనాల్డ్స్‌తో సంభాషించడం ఎంతో సంతోషంగా ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇది చాలా స్వాగతించదగినది’ అని ఫొటోతో పాటు క్యాప్షన్ పెట్టారు. దీంతో కొద్ది రోజులుగా శశిథరూర్ పై కథనాలు వెలువడుతున్న వేళ ఈ ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన త్వరలోనే పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కాగా, కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించినందుకు శశి థరూర్ పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ లో తన నాయకత్వం అవసరం లేకపోతే, తనకు ఇతర ఎంపికలు కూడా ఉన్నాయన్నారు. ‘పార్టీ దానిని ఉపయోగించుకోవాలనుకుంటే, నేను పార్టీకి అండగా ఉంటా. లేకపోతే నాకు నా సొంత పనులు ఉన్నాయి. నాకు వేరే మార్గం లేదని అనుకోకూడదు. నా ప్రసంగం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నట్టు స్పష్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం జరగడం గమనార్హం.

Next Story