- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల కేసు.. స్వామిపై పోక్సో నమోదు
మఠం వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న మైనర్ బాలుడిపై (16) లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పంచమశాలి గురుపీఠం మాజీ పీఠాధిపతి వచనానంద స్వామిపై ‘పోక్సో’ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో ఓ స్వామి అకృత్యాలు వెలుగుచూశాయి. మఠం వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న మైనర్ బాలుడిపై (16) లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పంచమశాలి గురుపీఠం మాజీ పీఠాధిపతి వచనానంద స్వామిపై ‘పోక్సో’ (POCSO) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలుడు హరిహర్ తాలూకా హనగవాడిలోని ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 8 తరగతులు చదువుతూ 2021 నుంచి 2024 వరకు మఠం హాస్టల్‌లో ఉన్నాడు. ఈ మూడేళ్ల వ్యవధిలోనే స్వామి అతడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బాలురు స్నానం చేసే సమయంలో బాత్రూంలోకి చొరబడే స్వామి.. వారిని నగ్నంగా మార్చి, తాను కూడా నగ్నంగా మారి తన ఒంటికి, ప్రైవేట్ భాగాలకు మసాజ్ చేయించుకునేవాడని బాలుడి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, వారి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక దాడికి పాల్పడేవాడని, ఈ విషయం బయటపెడితే ప్రాణాలు తీస్తానని బెదిరించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హాస్టల్ నుంచి బయటకు వచ్చాక బాలుడు తన తల్లికి జరిగిన ఘోరాన్ని వివరించడంతో ఈ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు.. దర్యాప్తు ముమ్మరం
బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో మొదట ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతమైన హరిహర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. ఈ ఘటనపై దావణగెరె ఎస్పీ హెచ్‌టీ శేఖర్ స్పందిస్తూ.. దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలోనే బాధిత బాలుడి వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదివరకే మఠం నుంచి బహిష్కరణ
బెంగళూరులోని శ్వాసయోగ పీఠాన్ని విడిచిపెట్టాలన్న ట్రస్ట్ ఆదేశాలను ధిక్కరించినందుకు వచనానంద స్వామిని ఏప్రిల్ 13న పంచమశాలి గురుపీఠం నుంచి తొలగించారు. ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే స్వామి దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలయ్యాయి. బాలురతో మసాజ్ చేయించుకోవడం, వారిని కొట్టడం, దుర్భాషలాడటం, అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు ఇవ్వకపోవడం వంటి వేధింపులపై ఇదివరకే ముగ్గురు బాలురు జిల్లా బాలల సంక్షేమ సమితి (CWC)కి ఫిర్యాదు చేశారు. దీంతో ఏప్రిల్ 17న సమితి ఛైర్‌పర్సన్ మంజుల మహేష్ నేతృత్వంలోని బృందం మఠాన్ని సందర్శించి స్వామితో సహా పలువురి వాంగ్మూలాలను రికార్డు చేసింది. బాధిత బాలురకు మూడు దశల్లో కౌన్సెలింగ్ ఇచ్చామని, ఈ నివేదికను త్వరలో హరిహర్ రూరల్ పోలీసులకు అందజేస్తామని కమిటీ తెలిపింది.
ముందస్తు బెయిల్.. మఠంలో ఉద్రిక్తతలు
తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వచనానంద స్వామి ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 21న కోర్టును ఆశ్రయించగా.. ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు వాదనలు విన్న అనంతరం మే 2న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తక్షణ అరెస్టుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు, ట్రస్ట్ సభ్యులు, స్వామి అనుచరుల మధ్య మే 4న ఘర్షణలు చోటుచేసుకోవడంతో.. అప్పటి నుంచి మఠంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.






