మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత బసవరాజ్ అలియాస్ గంగన్న మృతి?

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-21 07:34:51  IST  )

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని నారాయణ‌పూర్ (Narayanapur) జిల్లా మధ్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతోన్న ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత బసవరాజ్ అలియాస్ గంగన్న మృతి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని నారాయణ‌పూర్ (Narayanapur) జిల్లా మధ్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతోన్న ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలామంది అగ్రనేతలే ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజ్ మృతి చెందినట్లుగా సమాచారం. ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్‌లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, వారి వివరాలను మాత్రం పోలీసు ఉన్నతాధికారులు ఇంకా వెల్లడించలేదు.

NIA మోస్ట్ వాంటెడ్.. నంబాల కేశవ రావు

నంబాల కేశవ రావు (Nambala Keshava Rao) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా జియన్నపేట (Jiyannapet)లో 1955లో జన్మించారు. మావోయిస్టు పార్టీలో చేరాక ఆయన తన పేరును బసవ‌రాజ్‌గా మార్చుకున్నారు. ఉద్యమ సహచరులు ఆయనకు గంగన్న అని పేరు పెట్టుకున్నారు. భారతీయ మావోయిస్టు రాజకీయవేత్తగా ఆయన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నవంబర్ 2018లో ముప్పాల లక్ష్మణ రావు (అలియాస్ గణపతి) రాజీనామా తర్వాత బసవరాజ్ పార్టీకి సుప్రీం కమాండర్ (మిలిటరీ కమిషన్ చీఫ్) అయ్యారు. ప్రస్తుతం ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గంగన్న భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో కూడా ఉన్నారు. ఆయనపై రూ.కోటిన్నర రివార్డు కూడా ఉంది. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU), RSS విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) అనే రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో కేశవ రావును మాత్రమే అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

Next Story