నేను ఢిల్లీలో అడుగుపెట్టగానే తిహార్ జైలుకు తరలిస్తారు: 'కాక్రోచ్ జనతా పార్టీ' చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను ఢిల్లీలో అడుగుపెట్టగానే తిహార్ జైలుకు తరలిస్తారు: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను అమెరికా నుండి ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే, ఢిల్లీ పోలీసుల కాన్వాయ్ నన్ను నేరుగా తిహార్ జైలుకు తీసుకెళ్తుందని నా బలంగా అనిపిస్తోంది" అంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా కేవలం వ్యంగ్యం (Satire), హాస్యం కోసం పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ.. ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద సామాజిక, రాజకీయ చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యంగ్య డిజిటల్ ఉద్యమానికి యువత నుండి ఊహించని స్థాయిలో మద్దతు లభించింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 12 మిలియన్లకు (1.2 కోట్లు) పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. తద్వారా దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను (8.7 మిలియన్లు) కూడా ఇది దాటేయడం విశేషం.

దీనిపై అభిజీత్ దిప్కే స్పందిస్తూ..

"మాకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని నేనేమీ సంతోషంగా లేను. ఫాలోవర్లు పెరిగినంత మాత్రాన ఏం మారుతుంది? యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అసలు సమస్యలు అలాగే ఉన్నాయి కదా" అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పరిణామాల మధ్య, భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన అధికారిక 'ఎక్స్' (X) ఖాతాను చట్టపరమైన డిమాండ్ల (Legal Demand) కారణంగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ టన్ను అభిజీత్ షేర్ చేస్తూ.. మేము ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ను ఇండియాలో నిలిపివేశారు" అని పేర్కొన్నారు.

అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టారు?..

కొద్దిరోజుల క్రితం కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. "సమాజంలో వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువత కూడా బొద్దింకల (Cockroaches) లాగా తయారై ఉద్యోగాలు లేకుండా ఈ వృత్తిలోకి వస్తున్నారు" అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలపై నిరసనగా, డిజిటల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే "దేశంలో మన గుర్తింపు బొద్దింకల లాంటిదే అని తేలిపోయింది" అంటూ సరదాగా గూగుల్ ఫామ్ ద్వారా ఈ పార్టీని ప్రారంభించారు. కేవలం 24 గంటల్లోనే లక్షలాది మంది యువత ఇందులో' రిజిస్టర్ చేసుకున్నారు. అఖిలేష్ యాదవ్, మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్, మనీష్ సిసోడియా వంటి విపక్ష రాజకీయ నేతలు కూడా ఈ కాక్రోచ్ ఉద్యమానికి డిజిటల్ ప్లాట్ఫామ్లో మద్దతు ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో చదువు ముగించుకుని అమెరీకాలో ఉన్న అభిజీత్.. తాను ఇండియాకు రాగానే ప్రభుత్వం తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story