బెంగాల్ ఎన్నికల్లో సంచలనం.. స్టింగ్ ఆపరేషన్ వీడియో కలకలం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-10 09:01:53  IST  )

అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్ పాలిటిక్స్‌లో సంచలనం చోటుచేసుకుంది. హుమాయున్ కబీర్ స్టింగ్ ఆపరేష్ వీడియో బయటకు రావడంతో ఎంఐఎం పొత్తు రద్దు చేసుకుంది.

బెంగాల్ ఎన్నికల్లో సంచలనం.. స్టింగ్ ఆపరేషన్ వీడియో కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) అధ్యక్షుడు హుమాయున్ కబీర్‌ (Humayun Kabir)కు సంబంధించిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం (AIMIM) ఆయన పార్టీతో ఉన్న పొత్తును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

తృణమూల్ కాంగ్రెస్ (TMC) విడుదల చేసిన ఈ వీడియోలో హుమాయున్ కబీర్ విస్తుపోయే వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ నుంచి తనకు రూ.1,000 కోట్లు ఆఫర్ వచ్చిందని, ఇప్పటికే రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా అందాయని ఆయన పేర్కొన్నట్లు వీడియోలో ఉంది. ప్రధాని కార్యాలయం (PMO) ఆదేశాల మేరకు తాను సువేందు అధికారి, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ వంటి నేతలతో టచ్‌లో ఉన్నానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ముస్లింలను మోసం చేయడం చాలా సులభం అని ఆయన అన్నట్లుగా వీడియోలో ఉన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి.

పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం..

ఈ స్టింగ్ ఆపరేషణ్ వీడియో బయటకు రాగానే ఏఐఎంఐఎం (AIMIM) స్పందించింది. ముస్లింల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారితో కలిసి పనిచేయలేమని ఒవైసీ పార్టీ స్పష్టం చేసింది. ‘హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయి. బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఇకపై ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు’ అని ఎంఐఎం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ఆరోపణలను హుమాయున్ కబీర్ తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో ఏఐ (AI - Artificial Intelligence) సాయంతో సృష్టించిన నకిలీ వీడియో అని ఆయన వాదిస్తున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీఎంసీ నేతలు ఈ కుట్ర పన్నారని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.

Next Story