Delhi CM: ఢిల్లీ సీఎం ఎంపిక.. అదృష్టం ఎవరిని వరించనుందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-19 09:20:58  IST  )

దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ దాదాపు 27 ఏళ్ల తర్వాత తమ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే.

Delhi CM: ఢిల్లీ సీఎం ఎంపిక.. అదృష్టం ఎవరిని వరించనుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ దాదాపు 27 ఏళ్ల తర్వాత తమ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికి సీఎం అభ్యర్థి ఎవరనేది మాత్రం నేటికి క్లారిటీ రాలేదు. అయితే, ఈ సస్పెన్స్‌కు ఇంకొన్ని గంటల్లో తెరపడనుంది. సీఎం అభ్యర్థి ఎవరన్నది ఖరారు చేసేందుకు బుధవారం (ఫిబ్రవరి 19) ఉదయం ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ అధిష్టానం సమావేశమై ఢిల్లీ సీఎం ఎంపికపై పరిశీలకులను నియమించింది. పరిశీలకులుగా సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్ ఖడ్‌లను నియమించారు.

సీఎం అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు సేకరించి ప్రధాని మోడీ, నడ్డాలకు నివేదిక అందిస్తారు. సీఎం ఎంపికపై మోడీ, నడ్డాలు తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈరోజు సాయంత్రం నిర్వహించే శాసనసభాపక్ష నేతల సమావేశంలో సీఎంతో పాటు క్యాబినెట్‌ మంత్రులను ఎన్నుకోనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు.

ఇక సీఎం రేసులో ప్రధానంగా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖ గుప్తా, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పర్వేష్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం రేఖ గుప్తా వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా సీఎంలు లేరు. అందుకోసమే ఢిల్లీ పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్‌ వర్మ సీఎం రేసులో ముందున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పర్వేష్‌ వర్మకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని సమాచారం.

కాగా గురువారం (ఫిబవ్రరి 20) ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రామ్ లీలా మైదానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మొత్తం 150 మంది ముఖ్య అతిథులకు ఆహ్వానం పలికారు.

Next Story