Scindia: శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయలేము.. కేంద్ర మంత్రి జ్యోతిరాథిత్య సింధియా

by B.Srinivas |

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌కు చెందిన ఇంటర్నెట్ స్టార్ లింక్ సేవలు భారత్‌లోకి ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Scindia: శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయలేము.. కేంద్ర మంత్రి జ్యోతిరాథిత్య సింధియా
X

దిశ, నేషనల్ బ్యూరో: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌ (Elon musk)కు చెందిన ఇంటర్నెట్ స్టార్ లింక్ (Star link) సేవలు భారత్‌లోకి ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఇంకా ప్రభుత్వం ఆమోదం లభించనప్పటికీ ఇది త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌తో పాటు, ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ అలాగే అమెజాన్ కైపర్ కూడా భారతదేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించడానికి పోటీ పడుతున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే స్టార్ లింక్ ఆధిపత్యం చెలాయిస్తుందని, కాబట్టి దీనిని వేలం వేయాలని రిలయన్స్ సహా పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కమ్యునికేషన్స్ మంత్రి జ్యోతిరాథిత్య సింధియా (Jyothiraditya scindia) కీలక వ్యాఖ్యలు చేశారు. శాటిలైట్ స్పెక్ట్రం కేటాయింపు పరిపాలనా పరంగానే జరుగుతుందని, తమ నియంత్రణలో లేని ఆస్తిని వేలం వేయలేమని స్పష్టం చేశారు. కాబట్టి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వేలం వేయలేమని తేల్చి చెప్పారు. ప్రపంచంలోని ప్రతి దేశానికీ ఇది వర్తిస్తుందన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వేలం ద్వారా కాకుండా పరిపాలనా పద్దతుల ద్వారానే శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయిస్తామని తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశమూ శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం లేదని తెలిపారు. అమెరికా ఆర్బిట్ చట్టంలో ఉపగ్రహ వేలంపై నిషేధం ఉందన్నారు. అలాగే యూరప్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో శాటిలైట్స్‌ను అడ్మినిస్ట్రేషన్ పరంగానే కేటాయించారని గుర్తు చేశారు. ప్రపంచ ప్రమాణాలనే భారత్ అనుసరిస్తుందని నొక్కి చెప్పారు. స్పెక్ట్రం ధరను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిర్ణయిస్తుందని, ప్రభుత్వం దీనికి సూచన ఇచ్చిందని తెలిపారు. స్పెక్ట్రమ్ రేట్లను నిర్ణయించిన తర్వాత, అన్ని సర్వీస్ ప్రొవైడర్లకు కేటాయిస్తారని, ఇందులో ఎలాంటి వివక్షా ఉండబోదన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో టవర్ల అప్ గ్రేడ్

ఎన్సీపీ ఎంపీ ప్రపుల్ పటేల్ అడిగిన మరో ప్రశ్నకు సింధియా సమాధానమిచ్చారు. డిజిటల్ భారత్ నిధి కింద, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2343 టవర్లకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో 2.5లక్షల బీఎస్ఎన్ఎల్ టవర్లను అప్ గ్రేడ్ చేస్తున్నామని, అవసరమైన చోట బ్యాటరీ బ్యాకప్ సైతం అందిస్తున్నారని చెప్పారు. ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు వెల్లడించారు.

Next Story