- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏటీఎంలో సెలూన్ షాప్..! బీహార్‌లో విచిత్ర ఘటన వైరల్
బీహార్ రాష్ట్రంలోని పాట్నా సమీపంలో ఉన్న దానాపూర్‌లో ఒక విచిత్ర ఘటన వెలుగు చూసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్ రాష్ట్రంలోని పాట్నా సమీపంలో ఉన్న దానాపూర్‌లో ఒక విచిత్ర ఘటన వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారి, నెటిజన్లను నవ్విస్తోంది. ఎస్‌బీఐ ఏటీఎం బోర్డు ఉన్న ఒక గదిలో, డబ్బులు డ్రా చేసే మెషిన్‌కు బదులుగా.. అద్దాలు, కుర్చీలు పెట్టుకొని ఒక వ్యక్తి హెయిర్ కటింగ్ చేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. దానాపూర్‌లోని ఒక ప్రదేశంలో గతంలో ఎస్‌బీఐ ఏటీఎం ఉండేది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ఏటీఎంను బ్యాంక్ మూసివేసింది. ఆ తర్వాత బ్యాంకు అధికారులు ఆ ఖాళీ స్థలాన్ని వేరొకరికి అద్దెకు ఇచ్చారు. కానీ, అద్దెకు ఇచ్చే సమయంలో బయట ఉన్న ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఏటీఎం బోర్డును తొలగించడం మరిచిపోయారు. ఆ స్థలాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి అందులో ఏకంగా ఓ సెలూన్ షాపును ఏర్పాటు చేశాడు. దీంతో బయట నుంచి చూసేవారికి అది ఏటీఎంలా, లోపలికి వెళ్లి చూస్తే సెలూన్‌లా కనిపిస్తూ అందరినీ గందరగోళానికి గురిచేస్తోంది.
నెట్టింట నవ్వుల పాలు.. ఫన్నీ కామెంట్స్
ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా, సరదాగా స్పందిస్తున్నారు. కామెంట్ బాక్స్ మొత్తం మీమ్స్, సెటైర్లతో నిండిపోయింది. ఆర్థిక పరిభాషలో బ్యాంకులు నష్టపోవడాన్ని లేదా రుణమాఫీ చేయడాన్ని ‘హెయిర్ కట్’ అంటారు. ఇప్పుడు ఈ పదానికి ఎస్‌బీఐ సరికొత్త అర్థం చెబుతోందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ‘బ్యాంకులు తమ సేవలను విస్తరిస్తున్నాయి.. వారికి కూడా సైడ్ బిజినెస్ అవసరం’ అని కొందరు కామెంట్ చేశారు. ‘క్యాష్ డ్రా చేద్దామని లోపలికి వెళ్లిన కస్టమర్లు.. జుట్టు కత్తిరించుకుని వస్తున్నారు. ఎస్‌బీఐ దానాపూర్‌లో తన సేవలను బాగా విస్తరించింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘అత్యవసరంగా డబ్బులు డ్రా చేద్దామని లోపలికి వెళ్లగానే.. ‘జుట్టు ఎలా కత్తిరించాలి సార్?’ అని బార్బర్ అడిగితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అని మరో నెటిజన్ నవ్వులు పూయించారు. దీనిపై ఒక స్థానికుడు స్పందిస్తూ.. ‘బీహార్‌లో ఏదైనా సాధ్యమే.. రెండు రోజుల క్రితమే మా ఇంటి ముందున్న ట్రాక్టర్ బ్యాటరీని ఎవరో ఎత్తుకెళ్లారు’ అని కామెంట్ చేశాడు. అయితే, వీడియో వైరల్ కావడంతో సెలూన్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి ఎస్బీఐ బోర్డు కనపడకుండా పేపర్లను అతికించి కవర్ చేసిన మరో వీడియో సైతం వెలుగులోకి వచ్చింది.






