Sakshi Gupta: షేర్ మార్కెట్‌కు బానిసై..! కస్టమర్ల డబ్బులు కాజేసిన బ్యాంక్ అధికారిని అరెస్ట్..

by Ramesh Naini |

షేర్ మార్కెట్‌కు బానిసై ఓ బ్యాంకు మహిళా అధికారిని ఏకంగా కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) డబ్బులను కాజేసింది.

Sakshi Gupta: షేర్ మార్కెట్‌కు బానిసై..! కస్టమర్ల డబ్బులు కాజేసిన బ్యాంక్ అధికారిని అరెస్ట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: షేర్ మార్కెట్‌కు బానిసై ఓ బ్యాంకు మహిళా అధికారిని ఏకంగా కస్టమర్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) డబ్బులను కాజేసింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ఐసీఐసీఐ బ్యాంకులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటలోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామ్‌నగర్ (ICICI Bank) ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా సాక్షి గుప్తా (Sakshi Gupta) పని చేశారు. 'యూజర్ FD (ఫిక్స్‌డ్ డిపాజిట్)' లింక్‌ను దుర్వినియోగం చేసి, 2020, 2023 మధ్య 41 మంది కస్టమర్ల 110 పైగా ఖాతాల నుంచి రూ.4.58 కోట్లు అక్రమంగా కాజేసింది. ఈ డబ్బులతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టింది. కానీ లభాలు రాకపోగా భారీ నష్టాలు వచ్చాయి.

మరోవైపు కస్టమర్ల డబ్బులను ఆమె తిరిగి బ్యాంక్‌లో జమ చేయలేదు. ఈ క్రమంలోనే ఒక కస్టమర్ తన FD గురించి ఆరా తీయడానికి బ్యాంకుకు వచ్చినప్పుడు ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజర్ ఇది గుర్తించి.. ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్‌ సాక్షి గుప్తా నిందితురాలిగా గుర్తించారు. తాజాగా ఆమె సోదరి వివాహ వేడుకల్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇక, దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడైంది. లావాదేవీల మెసేజ్‌లు కస్టమర్లకు తెలియకుండా ఉండటానికి ఆ మహిళ ఖాతాలతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్లను మార్చింది. ఆమె తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఈ ఖాతాలకు లింక్ చేసి.. రూ. 4 కోట్లకు పైగా విత్‌డ్రా చేసింది. ఖాతాదారులకు జరిగిన మోసం గురించి తెలియకుండా ఉండటానికి ఆమె తన సిస్టమ్‌లో OTPలను పొందడానికి ఉపయోగించే వ్యవస్థను కూడా రూపొందించిందని దర్యాప్తు అధికారి ఇబ్రహీం ఖాన్ చెప్పారు. కాగా ఈ విషయమై ఐసీఐసీఐ బ్యాంక్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, నష్టపోయిన కస్టమర్లకు సొమ్ము భర్తీ చేస్తామని బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఆమెతో పాటు ఈ స్కామ్‌లో ఇతర బ్యాంక్ సిబ్బంది ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story