కుంగిన జాతీయ రహదారి.. పగుళ్లలో ఇరుక్కున్న పలు వాహనాలు.. కేంద్రమంత్రిపై తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

కేరళలోని కొట్టియం-మైలక్కడ్ ప్రాంతంలో 66వ జాతీయ రహదారి అకస్మాత్తుగా కుంగిపోయింది.

కుంగిన జాతీయ రహదారి.. పగుళ్లలో ఇరుక్కున్న పలు వాహనాలు.. కేంద్రమంత్రిపై తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళలోని కొట్టియం-మైలక్కడ్ ప్రాంతంలో 66వ జాతీయ రహదారి అకస్మాత్తుగా కుంగిపోయింది. కొత్తగా నిర్మాణం చేసిన ఈ రహదారి ఒక్కసారిగా పగుళ్లు రావడంతో నాలుగు వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవలి కాలంలో ఇదే హైవేపై ఇది రెండోసారి ఇలాంటి ఘటన జరగడం అని స్థానికులు వాపోయారు. ఈ ఘటనతో రహదారి నిర్మాణ నాణ్యతపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్డు ఇంత త్వరగా దారుణ స్థితికి చేరుకోవడంతో కాంట్రాక్టర్‌పై మండిపడుతున్నారు. ఈ ఘటనపై శనివారం కేరళ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో పోస్ట్ చేసింది.

‘కేరళలో ఎన్‌హెచ్-66 మళ్లీ కుంగిపోయింది. ఈ సారి కొట్టియం సమీపంలో కుప్పకూలింది. అందులో నాలుగు వాహనాలు ఇరుక్కున్నాయి, అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. కొన్ని నెలల క్రితం కోట్టక్కల్ వద్ద కూడా ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న హైవే నిర్మాణాల నాణ్యత ఏ స్థాయిలో ఉందో చూపిస్తుంది. అసలు కాంట్రాక్టు విలువ ఎంత? వాస్తవానికి ఎంత ఖర్చు చేస్తారు? ఎన్‌హెచ్-66 ఎక్కడైనా ఎప్పుడైనా కుంగిపోయే టైమ్ బాంబ్‌లా మారుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మౌనం వహిస్తున్నారు, ఎందుకంటే భారీ కాంట్రాక్టుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు తమ భద్రతను తామే చూసుకోవాల్సిన స్థితి వచ్చింది.’ అంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. కాగా, హైవే కుంగిపోయిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ట్వీట్ ఇదే..

Next Story