Jaishankar: మరింత బలోపేతం కానున్న చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు: ఎస్ జైశంకర్

by S Gopi |

హాన్ జెంగ్‌తో సమావేశం ద్వారా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు.

Jaishankar: మరింత బలోపేతం కానున్న చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు: ఎస్ జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం చైనా పర్యటనలో ఉన్నారు. ఐదేళ్ల తర్వాత మొదటిసారి చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్, బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో సమావేశం అయ్యారు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, రష్యాతో సంబంధాలున్న దేశాలపై 500 శాతం సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించిన ఈ నేపథ్యంలో చైనాతో భారత్ చర్చలకు సిద్ధమవడం చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా హాన్ జెంగ్‌తో సమావేశం ద్వారా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు.

హాన్ జెంగ్‌తో జరిగిన సమావేశంలో, జైశంకర్ చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) అధ్యక్ష పదవికి భారత మద్దతును వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ఓ పోస్ట్ చేసిన జైశంకర్.. ద్వైపాక్షిక సంబంధాలు బలపడనున్నాయి. తాను బీజింగ్‌కు వచ్చిన వెంటనే ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలవటం సంతోషంగా ఉంది. చైనా ఎస్‌సీఓ అధ్యక్ష పదవికి భారత మద్దతును తెలియజేశాను. మా ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదల కనిపించింది. ఈ పర్యటనతో జరిగే చర్చలు ఆ సానుకూల పథాన్ని కొనసాగిస్తాయని నమ్ముతున్నట్టు పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయినట్టు జైశంకర్ అన్నారు. గతేడాది అక్టోబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పిన్ సమావేశం అనంతరం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. కైలాష్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభాన్ని భారత్‌లో విస్తృతంగా ప్రశంసిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇరు దేశాల సంబంధాలను నిరంతరం కొనసాగించడం వల్ల పరస్పర ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను సంక్లిష్టమన్న జైశంకర్.. పొరుగు దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా భారత్, చైనా మధ్య అభిప్రాయాలు, దృక్పథాల పరస్పర మార్పిడి చాలా ముఖ్యం. ఈ పర్యటన సందర్భంగా నేను అలాంటి చర్చల కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూని కూడా జైశంకర్ కలవనున్నారు. అలాగే, మంగళవారం(జూలై 15) టియాంజిన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా జైశంకర్ హాజరుకానున్నారు.

Next Story