ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం వద్దు.. యూఎస్‌కు వార్నింగ్ ఇచ్చిన రష్యా

by Phanindra |

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని యూఎస్‌కు రష్యా వార్నింగ్ ఇచ్చింది. లేదంటే పరిస్థితి చెయ్యిదాటిపోతుందని హెచ్చరించింది.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం వద్దు.. యూఎస్‌కు వార్నింగ్ ఇచ్చిన రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని రష్యా హెచ్చరించింది. ‘మేం యూఎస్‌ను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఈ యుద్ధంలో ఎలాంటి మిలిటరీ జోక్యం చేసుకోవద్దు. అలా చేస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయి. దీంతో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా చెప్పారు. అదే సమయంలో ఇరాన్‌లోని ముషెహర్ న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌ను కూడా రష్యా కోరింది. ఈ ప్లాంట్‌లో రష్యా నిపుణులు పని చేస్తుండటమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఈ న్యూక్లియర్ ప్లాంట్లో రష్యాకు చెందిన ఇంధనాన్ని ఇరాన్ ఉపయోగిస్తుంది. ఆ తర్వాత అణు ధార్మికత పెరగకుండా ఉండేందుకు వాడేసిన ఇంధనాన్ని రష్యా తిరిగి తీసేసుకుంటుంది.

ఈ క్రమంలోనే ఇరాన్‌లోని న్యూక్లియర్ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని కూడా జఖరోవా తప్పుబట్టారు. ప్రపంచం అత్యంత దారుణమైన ప్రమాదాన్ని ఎదుర్కొనేదని, ఐక్యరాజ్య సమితిలోని న్యూక్లియర్ వాచ్ డాగ్ కూడా ఎంత నష్టం జరిగిందీ వివరాలు వెల్లడిచిందని ఆమె తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచం ఎందుకు ఆందోళన చెందడం లేదని నిలదీశారు. ‘పర్యావరణ పరిరక్షకులు ఏం చేస్తున్నారు? ఈ రేడియేషన్ వాళ్లను చేరుకోలేదని అనుకుంటున్నారా? 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో ఏం జరిగిందో వాళ్లు చదువుకుంటే మంచిది’ అని విమర్శించారు. 2011లో ఫుకుషిమాలోని జపనీస్ న్యూక్లియర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగి రేడియో యాక్టివ్ పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యాయి.

అంతకుముందు రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబకోవ్ కూడా ఇజ్రాయెల్‌కు యూఎస్‌ మిలిటరీ సహాయం చేయొద్దని హెచ్చరించారు. ‘ఈ ఆలోచన కూడా చెయ్యొద్దని యూఎస్‌ను మేం హెచ్చరిస్తున్నాం. యూఎస్ జోక్యం చేసుకుంటే పరిస్థితి చాలా అస్థిరంగా మారి, దారుణమైన పరిణామాలు ఎదురవుతాయి’ అని ర్యాబకోవ్ పేర్కొన్నారు.

Next Story