- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia: రష్యా అమెరికా మధ్య చర్చలు.. మూడేళ్ల తర్వాత తెరుచుకోనున్న రాయబార కార్యాలయాలు
రష్యా, అమెరికాకు చెందిన ప్రతినిధులు సౌదీ అరేబియాలో సోమవారం సమావేశమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడంపై శాంతి ఒప్పందం, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడానికి గల మార్గాలను చర్చించడానికి రష్యా, అమెరికాకు చెందిన ప్రతినిధులు సౌదీ అరేబియా (Saudi arebiya)లో సోమవారం సమావేశమయ్యారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్, యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు కీలక అంశాలపై డిస్కస్ చేశారు. రెండు దేశాలు ఒకరి ప్రయోజనాలను మరొకరు పరిగణనలోకి తీసుకుని తమ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి.
ఎంబసీల్లో సిబ్బంది పునరుద్ధరణ
రెండు దేశాలు తమ తమ రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని పునరుద్ధరించడానికి అంగీకరించాయి. ఉద్రిక్తత తలెత్తకుండా ఉండటానికి వెంటనే సిబ్బందిని నియమించాలని తెలిపాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇరు దేశాలు తమ రాయబార కార్యాలయం నుండి సిబ్బందిని బహిష్కరించాయి. దాదాపు మూడేళ్లుగా ఎంబసీలు మూసివేశారు. ఈ నేపథ్యంలో వాటిని మళ్లీ పునరుద్ధరించాలని ఒప్పం చేసుకున్నారు. అలాగే ఉక్రెయిన్ దాడి కారణంగా మాస్కోపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా అనుకూలంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తెలిపారు.
త్వరలోనే పుతిన్ ట్రంప్ సమావేశం!
రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌లు త్వరలో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య మీటింగ్ ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. పుతిన్ విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ మాట్లాడుతూ శిఖరాగ్ర సమావేశానికి ఇంకా తేదీ నిర్ణయించలేదని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ సమస్యపై శాంతి ఒప్పందం కోసం రెండు దేశాలు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాయని, ఇవి నిరంతరం పరిస్థితిపై చర్చిస్తాయని సమాచారం.
ఉక్రెయిన్ లేకుండా చర్చలా: జెలెన్ స్కీ
రష్యా అమెరికాల చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. టర్కీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ గురించి ఉక్రెయిన్ ప్రతినిధులు లేకుండా చర్చలు జరగడం ఏంటని ప్రశ్నించారు. యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో చర్చలు జరిగితే అవి న్యాయంగా ఉండాలని తెలిపారు. శాంతి చర్చల్లో యూరోపియన్ యూనియన్ సహా టర్కీ కూడా భాగస్వామ్యం కావాలన్నారు. తన సౌదీ అరేబియా పర్యటనను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.






