ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు రెడీ.. రష్యా మాజీ ప్రెసిడెంట్ షాకింగ్ వ్యాఖ్యలు!

by Phanindra |

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు చాలా దేశాలు రెడీగా ఉన్నాయట. ఈ విషయాన్ని రష్యా మాజీ ప్రెసిడెంట్ వెల్లడించారు.

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు రెడీ.. రష్యా మాజీ ప్రెసిడెంట్ షాకింగ్ వ్యాఖ్యలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ దాడుల తర్వాత ఇరాన్‌కు అణ్వాయుధాలు అందించేందుకు ఎన్నో దేశాలు సిద్ధమయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ అన్నారు. ఇరాన్‌లోని ఇస్ఫాన్, నతాంజ్, ఫార్డో న్యూక్లియర్ సైట్స్‌పై యూఎస్ చేసిన దాడులు విఫలమయ్యాయని, దీంతో అమెరికా అనుకున్న ఫలితాలు రాలేదని ఆయన అన్నారు. అదే సమయంలో పరిస్థితి యూఎస్‌కు వ్యతిరేకంగా తయారైందన్నారు. ఎక్స్ వేదికగా పలు పోస్టులు పెట్టిన మెద్వెదేవ్.. ‘ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్స్‌పై దాడులు చేయడం ద్వారా యూఎస్ ఏం సాధించింది? న్యూక్లియర్ ఫ్యూయెల్ సైకిల్‌లో కీలకమైన సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదు. దీని వల్ల భవిష్యత్తులో అణ్వాయుధాల ఉత్పత్తి కొనసాగుతుందని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. అసలు ఇప్పటికే చాలా దేశాలు తమ న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను ఇరాన్‌కు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని వెల్లడించారు. అయితే ఏ దేశాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

ఇరాన్‌కే మేలు..

అదే సమయంలో ఇరాన్ రాజకీయ నాయకత్వానికి సురక్షితంగానే ఉందని, ఇన్నిరోజులు దీన్ని వ్యతిరేకించిన వారు కూడా యూఎస్ దాడుల తర్వాత ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో నోబెల్ శాంతి బహుమతి పొందాలనే ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయని చురకలేశారు. ఈ అవార్డు ప్రక్రియ ఆసాంతం రిగ్గింగ్‌గా మారిందన్న మెద్వెదేవ్.. అయినా సరే ట్రంప్ మాత్రం ఈ అవార్డు పొందలేరన్నారు. అలాగే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో పరిస్థితులు దారుణంగా మారాయని, ఆ దేశంపై భారీగా దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో గ్రౌండ్ ఆపరేషన్లు కూడా మొదలయ్యేలా ఉన్నాయని, దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

Next Story