- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మేము వెళ్లగొట్టకముందే పారిపోండి’.. అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం సువేందు తీవ్ర హెచ్చరిక!
పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులపై కొత్తగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులపై కొత్తగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ చొరబాటుదారులకు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ‘ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకముందే.. మీ అంతట మీరే ఇక్కడి నుంచి పారిపోండి’ అంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టం (Foreigners’ Act) లోబడే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి కొత్త చట్టం లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ చొరబాటుదారులు ఏమైనా మన అల్లుళ్లా?
ఈ అంశంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తమ పౌరులను తిరిగి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఇక్కడున్న అక్రమ వలసదారులు తక్షణమే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి. అక్రమంగా వచ్చిన వారిని జైళ్లలో పెట్టి బంధించవద్దని నేను పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వారిని జైల్లో ఉంచి భారతదేశ వనరులను, ప్రజల సొమ్మును ఎందుకు వృధా చేయాలి? ఈ చొరబాటుదారులు ఏమైనా మనకు అల్లుళ్లా?’ అని సీఎం ఘాటుగా ప్రశ్నించారు.
సరిహద్దుల్లో మొదలైన వలసదారుల కదలికలు
ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్లకుంటే, ప్రభుత్వం తదుపరి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేయడంతో వలసదారుల్లో వణుకు మొదలైంది. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీగా అక్రమ వలసదారులు గుమిగూడారు. ప్రభుత్వం తనిఖీలను తీవ్రతరం చేయడంతో, వారంతా తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ సమయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.






