Rudra brigade: భారత సైన్యంలో ‘రుద్ర’ బ్రిగేడ్.. ఇక శత్రువులకు వణుకే

by B.Srinivas |

సరిహద్దుల్లో భారత్ పాక్‌లు తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.

Rudra brigade: భారత సైన్యంలో ‘రుద్ర’ బ్రిగేడ్.. ఇక శత్రువులకు వణుకే
X

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దుల్లో భారత్ పాక్‌లు తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కవ్వించిన వెంటనే వారికి సమాధానం ఇచ్చేలా సైన్యంలో నూతన యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో కలిగే ముప్పును దృష్టిలో ఉంచుకుని ‘రుద్ర’ (Rudra) అనే పేరుతో ‘ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్’ను ఏర్పాటు చేసినట్టు కార్గిల్ విజయ్ దివస్ సంద్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ శనివారం వెల్లడించారు. భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రుద్ర కింద పదాతిదళం, మెకనైజ్‌డ్ పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగిదళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి పోరాట భాగాలను ఏకీకృతం చేసినట్టు చెప్పారు. ఇండియన్ ఆర్మీ ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడమే గాక, శత్రువుల వ్యూహానికి వ్యతిరేకంగా బలంగా సిద్ధం కావడం ప్రారంభించిందన్నారు.

అలాగే బార్డర్‌లో శత్రువులను దీటుగా ఎదుర్కోవడానికి మరొక చురుకైన ప్రత్యేక దళాల విభాగం ‘భైరవ్’ (Byrav) లైట్ కమాండో బెటాలియన్ స్థాపించారు. భైరవ్ లైట్ కమాండో యూనిట్ మన బలాన్ని అనేక రెట్లు పెంచుతుందన్నారు. భారతదేశ భౌగోళిక సరిహద్దుల వెంబడి నిరంతర ప్రతికూల వాతావరణం దృష్యా, స్వదేశీ క్షిపణి వ్యవస్థను అమర్చుతున్నట్టు తెలిపారు. సరిహద్దు వద్ద కొత్త రోడ్లు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పాక్‌కు ప్రత్యక్ష సందేశాన్ని పంపిందని, ఉగ్రవాదుల మద్దతుదారులను వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

Next Story