- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టికెట్ కోసం రూ.5 కోట్లు అడిగారు.. టీఎంసీపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల నాయకత్వంపై సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీలో ముసలం మొదలైంది. పార్టీలో పెరిగిపోయిన అవినీతి, అప్రజాస్వామిక పోకడలే ఓటమికి కారణమని పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మాజీ క్రికెటర్, మాజీ మంత్రి మనోజ్ తివారీ టీఎంసీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని ఆయన ఆరోపించారు. తాను ఆ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడం వల్లే తనకు టికెట్ దక్కలేదని, సుమారు 72 మంది అభ్యర్థులు కోట్లు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.
సస్పెన్షన్ నేతల తీవ్ర ఆరోపణలు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న నెపంతో టీఎంసీ ప్రతినిధులు రిజు దత్తా, కోహినూర్ మజుందార్, కార్తీక్ ఘోష్‌లను పార్టీ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు గురైన రిజు దత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీ ఒత్తిడి, బెదిరింపుల వల్లే బీజేపీ నేత సువేందు అధికారిపై విమర్శలు చేశానని చెబుతూ ఆయనకు క్షమాపణలు కోరారు. అభిషేక్ బెనర్జీని కలవాలంటే నేతలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, సీనియర్ నేతలకు కనీస గౌరవం దక్కడం లేదని కోహినూర్ మజుందార్ అసహనం వ్యక్తం చేశారు. వరుసగా వస్తున్న ఈ ఆరోపణలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పార్టీలో ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి వల్లే ప్రజలు తమను తిరస్కరించారని అసమ్మతి నేతలు స్పష్టం చేస్తున్నారు.






