బిర్యానీ మాటున స్కాం.. రెస్టారెంట్లలో రూ.70 వేల కోట్ల మోసం..!

by Phanindra |

బిర్యానీ మాటున స్కాం.. రెస్టారెంట్లలో రూ.70 వేల కోట్ల మోసం వెలుగు చూసింది.

బిర్యానీ మాటున స్కాం.. రెస్టారెంట్లలో రూ.70 వేల కోట్ల మోసం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: రెస్టారెంట్లపై రొటీన్ రెయిడ్ చేసిన ట్యాక్స్ అధికారులు దిమ్మతిరిగే స్కాం కనిపెట్టారు. రెస్టారెంట్ రంగంలో కనీసం రూ.70 వేల కోట్ల విలువైన స్కాం జరుగుతోందని గుర్తించారు. హైదరాబాద్‌లోని బిర్యానీ రెస్టారెంట్లపై రెయిడ్స్ సందర్భంగా ఈ షాకింగ్ విషయం వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లలో అధికంగా ఉపయోగించే బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఒక చిన్న ఫీచర్ సాయంతో ఈ ట్యాక్స్ ఎగవేత స్కాం జరుగుతోందని అధికారులు తెలిపారు. దేశంలోని మొత్తం రెస్టారెంట్లలో కనీసం 10 శాతం రెస్టారెంట్లలో ఉపయోగించే ఈ సాఫ్ట్‌వేర్.. చెల్లింపులు పూర్తయిన తర్వాత బిల్లును డిలీట్ చేసే అవకాశం ఇస్తుంది. దీన్ని ఉపయోగించుకొని రెస్టారెంట్ ఇండస్ట్రీలో భారీ స్కాం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే సదరు సాఫ్ట్‌వేర్ అందిస్తున్న కంపెనీని సంప్రదించారు. బ్యాక్ ఎండ్ యాక్సెస్ తీసుకొని 2019 నుంచి 2026 వరకు ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సుమారు 60 టెరా బైట్ల డేటాను అనలైజ్ చేశారు.

రూ.2.43 లక్షల కోట్ల బిల్లు

ఈ ఆరు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి మొత్తం రూ.2.43 లక్షల కోట్ల విలువైన బిల్లులను ట్యాక్స్ అధికారులు పరిశీలించారు. దీంట్లో రూ.13,317 కోట్ల బిల్లులను చెల్లింపులు పూర్తయ్యాక డిలీట్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఆయాకర్ భవన్‌లో ఏఐ, జనరేటివ్ ఏఐ సాయంతో ఈ భారీ డేటాను అనలైజ్ చేశారు. సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీలు, జీఎస్టీ నెంబర్లు, పాన్ నెంబర్లను అధికారులు పరిశీలించారు. మొత్తంగా రూ.70 వేల కోట్ల రూపాయల విలువైన అమ్మకాలను ఐటీ రిటర్న్స్‌లో మాయం చేసినట్లు తెలిపారు. ఇలా చేసేందుకు రెస్టారెంట్లు పలు మార్గాలు అనుసరించినట్లు తెలుస్తోంది.

డబ్బులిస్తే బిల్లు మాయం..

రెస్టారెంట్లలో పేమెంట్స్ రకరకాలుగా చేస్తారు. కొన్ని సార్లు యూపీఐ, కార్డులతో చేస్తే.. చాలామంది ఇప్పటికీ డబ్బులు ఉపయోగిస్తున్నారు. ఇలా క్యాష్ రూపంలో బిల్లు చెల్లించిన వినియోగదారుల బిల్లులను రెస్టారెంట్లు డిలీట్ చేసేస్తున్నాయి. అది కూడా ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన ముందే ఇలా చేసి, ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నాయి. కొన్నిసందర్భాల్లో ఏకంగా కొన్నిరోజుల బిల్లింగ్ డేటాను పూర్తిగా డిలీట్ చేసేస్తున్నాయి. పలు రెస్టారెంట్లు ఏకంగా 30 రోజుల డేటా డిలీట్ చేసి, తక్కువ ఆదాయంతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని రెస్టారెంట్లయితే బిల్లులు అలాగే ఉంచేసి, ఐటీ రిటర్న్స్‌లో మాత్రం అబద్ధపు లెక్కలు చూపించినట్లు తేలింది.

టాప్ స్కామర్లు కర్ణాటక, తెలంగాణలో..

ఇలా బిల్లింగ్ మోసాలతో భారీగా ట్యాక్స్ ఎగ్గొట్టిన రాష్ట్రం కర్ణాటక. హైదరాబాద్‌లో విషయం బయటపడటంతో నెమ్మదిగా దేశవ్యాప్తంగా ఈ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించే రెస్టారెంట్ల డేటాను అధికారులు పరిశీలించారు. దీంట్లో దక్షిణాది రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఎక్కువ స్కాం చేస్తున్నట్లు తేలింది. కర్ణాటకలో రూ.2000 కోట్ల విలువైన బిల్లులు డిలీట్ చేయగా.. తెలంగాణలో రూ.1500 కోట్ల విలువైన బిల్లులు, తమిళనాడులో రూ.1200 కోట్ల విలువైన బిల్లులు డిలీట్ చేసినట్లు తేలింది. మహారాష్ట్ర, గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఏపీ, తెలంగాణలో..

ఏపీ, తెలంగాణల్లో కలిపి 3,734 పాన్ కార్డుల డేటాను పరిశీలించగా.. ఏకంగా రూ.5,141 కోట్ల అమ్మకాలను తప్పుగా చూపించినట్లు అధికారులు గుర్తించారు. రెండు రాష్ట్రాల్లోని 40 రెస్టారెంట్లను టార్గెట్ చేసి అనలైజ్ చేస్తే.. ఈ రెస్టారెంట్లలోనే సుమారు రూ.400 కోట్ల స్కాం జరిగినట్లు తేలింది. కొన్ని సందర్భాల్లో 27 శాతం వరకు అమ్మకాలను ఈ రెస్టారెంట్లు లెక్కల్లో చూపలేదని అధికారుగు గుర్తించారు. ఇదంతా కూడా ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన డేటా తీస్తేనే బయటపడిన స్కాం. ఈ క్రమంలో మిగతా బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లను కూడా పరిశీలించాలని ట్యాక్స్ విభాగం భావిస్తున్నట్లు సమాచారం.

Next Story