అజిత్ పవార్ మృతి వెనుక పెద్ద కుట్ర.. ఎన్సీపీ నేత సంచలన ఆరోపణలు

by Ramesh Naini |

ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు.

అజిత్ పవార్ మృతి వెనుక పెద్ద కుట్ర.. ఎన్సీపీ నేత సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిన ‘పెద్ద కుట్ర’ అని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 28న జరిగిన ఈ ప్రమాదం 100 శాతం ఉద్దేశపూర్వకంగా జరిగిందని రోహిత్ ఆరోపించారు. విమాన ల్యాండింగ్ సమయంలో ప్రోటోకాల్స్ పాటించలేదని ధ్వజమెత్తారు. విమానం నడిపిన పైలట్ల అనుభవంపై ఆయన ప్రశ్నలు సంధించారు. గతంలో ఒక పైలట్ మద్యం సేవించి విమానం నడిపిన సందర్భాలు ఉన్నాయని, పైలట్ల తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు.

ప్రయాణంలో మార్పు

నిజానికి అజిత్ పవార్ ఆ రోజు కారులో ప్రయాణించాల్సి ఉంది. కానీ, ఒక "పెద్ద నేత"తో జరిగిన సమావేశం ఆలస్యం కావడం వల్ల చివరి నిమిషంలో విమానం బుక్ చేయాల్సి వచ్చిందని, దీని వెనుక ఏదో మర్మం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ గత కొంతకాలంగా విషప్రయోగం జరుగుతుందేమోనన్న భయంతో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులు గాజు సీసాలనే వాడుతున్నారని, అంత జాగ్రత్తగా ఉండే వ్యక్తి మృతిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి 14 రోజులు గడుస్తున్నా దర్యాప్తులో జాప్యం జరుగుతోందని, ఏవియేషన్ కంపెనీ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని రోహిత్ ఆందోళన వ్యక్తం చేశారు.

శరద్ పవార్ వ్యాఖ్యలపై వివరణ..

ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని గతంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ప్రమాదం జరిగిన 6 గంటలకే పవార్ సాహెబ్ ఆ వ్యాఖ్య చేశారు. కానీ నేను 13 రోజుల పరిశోధన తర్వాత ఈ విషయాలు చెబుతున్నాను. అప్పట్లో శాంతిభద్రతల దృష్ట్యా ఆయన అలా అని ఉండొచ్చు’ అని రోహిత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏవియేషన్ కంపెనీ యజమానులపై హత్యానేరం (Culpable Homicide) కింద కేసు నమోదు చేయాలని, ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story