National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు

by S Gopi |   (  Updated:2025-05-02 18:41:39  IST  )

అనంతరం తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేశారు.

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ మాజీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితులపై కేసును అధికారికంగా చేపట్టాలా వద్దా అని కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావడానికి వారికి ప్రత్యేక హక్కు ఉంది. ఛార్జీషీట్‌లో మార్పులు చేశారని, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 223 కింద నోటీసు జారీ చేయాలా వద్దా అనేది ప్రస్తుత సమస్య అని కోర్టు అభిప్రాయపడింది. ఛార్జీషీట్‌పై న్యాయపరమైన విచారణ జరుగుతున్న సమయంలో ఎదుటి పక్షం వాదనలు వినిపించడానికి హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నె చెప్పారు. విచారణ ఏ దశలోనైనా హాజరయ్యే హక్కు న్యాయమైన విచారణ హక్కుకు ప్రాణం పోస్తుందని, ఈ దశలో నిందితులను విచారిస్తే ఈడీ ఎటువంటి నష్టం ఉండదని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను మే 8వ తేదీకి వాయిదా వేశారు. గతవారం జరిగిన విచారణ సందర్భంగా.. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జీషీట్‌ను పరిగణించలేమని, అందుకోసం విచారణకు హాజరయ్యేలా నిందితులకు నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, సరైన పత్రాలు లేవని ఢిల్లీ కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వడానికి నిరాకరించింది.

Next Story