Tejashwi Yadav: కులగణన డేటా కాదు.. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం- తేజస్వి

by Shamantha N |   (  Updated:2025-05-03 12:27:22  IST  )

కులగణన డేటా కాదని.. అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) తెలిపారు.

Tejashwi Yadav: కులగణన డేటా కాదు.. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం- తేజస్వి
X

దిశ, నేషనల్ బ్యూరో: కులగణన డేటా కాదని.. అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) తెలిపారు. వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను (Caste Census) చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని.. ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని చెప్పుకొచ్చారు. కులగణన నిర్వహించిన తర్వాత ఆ డేటాను వ్యవస్థాగత సంస్కరణలకు వాడుతారే లేదా మునుపటి కమిషన్ నివేదికల మాదిరిగానే ఉంచేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు. అంతేకాకుండా, జనాభా లెక్కలు, కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బిహార్‌ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

కులగణన డిమాండ్లు..

ఎన్నోఏళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న కులగణన డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోకుండా.. దేశ ప్రజల్లో విభజనలు చేయడం సరైన చర్య కాదని తేజస్వి లేఖలో పేర్కొందన్నారు. బిహార్ కుల సర్వే చేపట్టినప్పుడు కూడా పదేపదే దానిని అడ్డుకుందని గుర్తు చేశారు. ఆలస్యంగా అయినా కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివల్ల అణచివేతకు గురవుతున్న అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జనాభా గణన డేటా సామాజిక రక్షణ, రిజర్వేషన్ విధానాల సమగ్ర సమీక్షకు ఉపయోగపడేలా ఉండాలని తేజస్వీ అన్నారు. అదేవిధంగా రిజర్వేషన్లపై ఉన్న ఏకపక్ష పరిమితిని కూడా మరోసారి పరిశీలించాలని కోరారు. ఇకపోతే, జనాభా లెక్కల్లోనే కులగణను నిర్వహించాలని కేంద్రం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీనిపైనే మోడీకి తేజస్వి లేఖ రాశారు.

Next Story