విజయ్‌ చౌక్‌లో కనువిందుగా ‘బీటింగ్‌ రిట్రీట్‌’.. ఘనంగా ముగిసిన గణతంత్ర వేడుకలు

by Ramesh Naini |

దేశ రాజధానిలోని విజయ్‌ చౌక్‌లో గురువారం సాయంత్రం జరిగిన ‘బీటింగ్‌ రిట్రీట్‌’ వేడుకతో గణతంత్ర దినోత్సవ సంబరాలు అధికారికంగా ముగిశాయి.

విజయ్‌ చౌక్‌లో కనువిందుగా ‘బీటింగ్‌ రిట్రీట్‌’.. ఘనంగా ముగిసిన గణతంత్ర వేడుకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ రాజధానిలోని విజయ్‌ చౌక్‌లో గురువారం సాయంత్రం జరిగిన ‘బీటింగ్‌ రిట్రీట్‌’ వేడుకతో గణతంత్ర దినోత్సవ సంబరాలు అధికారికంగా ముగిశాయి. దేశ సైనిక పటిమను, ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ. రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే బీటింగ్‌ రిట్రీట్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'X' (ట్విట్టర్) వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బీటింగ్‌ రిట్రీట్‌ వేడుక భారత సైనిక వారసత్వ బలాన్ని చాటిచెబుతుంది. మన సాయుధ దళాల క్రమశిక్షణ, సంప్రదాయాలు, పరాక్రమానికి ఇది నిదర్శనం. దేశ రక్షణ కోసం అంకితభావంతో పని చేస్తున్న మన సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు.

సంగీత విన్యాసాల హోరు..

సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బ్యాండ్‌లు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించాయి. దేశభక్తి గీతాలు, శాస్త్రీయ సంగీత బాణీలను మేళవిస్తూ సైనిక దళాలు చేసిన కవాతు వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, క్రమశిక్షణతో ముగియడంతో ఈ ఏడాది గణతంత్ర వేడుకలు అధికారికంగా ముగిసినట్లయింది.

Next Story