సహజీవనం ద్వారా పిల్లల్ని కనడం దానితో సమానమే : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

22 ఏళ్ల యువతి, తాను నిందితుడితో దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధంలో ఉన్నానని, అతని ఒత్తిడితో ఒకసారి గర్భస్రావం చేయించుకున్నానని, తర్వాత కూడా సంబంధం కొనసాగి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చానని కోర్టులో తెలిపింది.

సహజీవనం ద్వారా పిల్లల్ని కనడం దానితో సమానమే : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దీర్ఘకాలం కలిసి జీవించడం, పదేపదే సహజీవనం చేయడం, ఆ బంధం నుంచి సంతానం పుట్టడం వంటి అంశాలు ఉంటే అది “వివాహ స్వరూప సంబంధం (Relationship in the nature of marriage)”గా పరిగణించవచ్చని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన భాగస్వామి ఫిర్యాదుపై నమోదైన కేసును కొట్టివేయాలన్న వ్యక్తి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

ట్రావెల్‌కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (చమోర్షి) కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుతో పాటు, 2022, 2023లో తన భాగస్వామి, కుమార్తెకు పోషణ ఖర్చులు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని నిందితుడు, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎం.ఎం. నెర్లికర్, నిందితుడిపై ఉన్న గృహహింస కేసును కొట్టివేయడానికి నిరాకరించారు. అయితే నిందితుడి తల్లిదండ్రులు, భార్యపై ఉన్న ఆరోపణల నుంచి వారికి ఉపశమనం కల్పించారు.

ఫిర్యాదుదారు అయిన 22 ఏళ్ల యువతి, తాను నిందితుడితో దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధంలో ఉన్నానని, అతని ఒత్తిడితో ఒకసారి గర్భస్రావం చేయించుకున్నానని, తర్వాత కూడా సంబంధం కొనసాగి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చానని కోర్టులో తెలిపింది. ప్రస్తుతం ఆ బాలికకు 8 నెలల వయసు ఉందని పేర్కొంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిందితుడు నిరాకరించి 2022లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని, ఆ తర్వాత మే 7, 2022న ఐపీసీ కింద అత్యాచారం కేసు, అలాగే ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఫిర్యాదు చేసినట్లు వివరించింది.

నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తూ.. “వీకెండ్‌లలో కలవడం లేదా ఒక్క రాత్రి సంబంధం పెట్టుకోవడం గృహ సంబంధంగా పరిగణించలేము. ఇది కేవలం ప్రతీకార చర్య మాత్రమే” అని వాదించారు. అయితే ఫిర్యాదుదారి తరపు న్యాయవాది.. మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే నెలకు ఆమెకు రూ.5,000, పిల్లకు రూ.2,000 చొప్పున మధ్యంతర పోషణ ఖర్చులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పూర్తి విచారణ పూర్తయ్యే వరకు కేసును కొట్టివేయకూడదని, గృహహింస చట్టంలో “డొమెస్టిక్ రిలేషన్‌షిప్” నిర్వచనాన్ని అర్థం చేసుకోవాలని వాదించారు.

వాదనలు విన్న హైకోర్టు.. నిందితుడు తరువాత పెళ్లి చేసుకున్నాడన్న కారణంతోనే మహిళకు గృహహింస చట్టం కింద రక్షణ ఇవ్వకూడదని అనలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ… సంబంధం సాగిన కాలం, శారీరక సంబంధ స్వభావం, పిల్లల ఉనికి వంటి అంశాలు వివాహ బంధానికి బలమైన సూచకాలని వ్యాఖ్యానించింది. “ఈ ఇద్దరి మధ్య దీర్ఘకాల సంబంధం ఉంది. వారి బంధానికి గుర్తుగా ఆడబిడ్డ జన్మించింది. కాబట్టి ఇది వివాహ స్వరూప సంబంధంగా పరిగణించవచ్చు. ఈ దశలోనే కేసును కొట్టివేయడానికి కోర్టు సిద్ధంగా లేదు,” అని హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story