- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరట: సురక్షితంగా హర్మూజ్ జలసంధి దాటిన రెండు భారతీయ ఎల్పీజీ నౌకలు..
భారీగా ఎల్పీజీ (LPG) గ్యాస్‌తో వస్తున్న ‘జగ్ వసంత్’, ‘పైన్ గ్యాస్’ అనే రెండు భారత నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఎల్పీజీ సరఫరాపై ఆందోళన చెందుతున్న భారత్‌కు కాస్త ఊరటనిచ్చే వార్త. భారీగా ఎల్పీజీ (LPG) గ్యాస్‌తో వస్తున్న ‘జగ్ వసంత్’, ‘పైన్ గ్యాస్’ అనే రెండు భారత నౌకలు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. ప్రస్తుతం ఈ నౌకలు ఓమన్ గల్ఫ్‌లో భారత నౌకాదళ యుద్ధనౌకల భద్రత (ఎస్కార్ట్) మధ్య ప్రయాణిస్తున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా వెల్లడించారు. జగ్ వసంత్.. ఈ నౌకలో 47,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మార్చి 26న గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకోనుంది. ఇందులో 33 మంది భారతీయ నావికులు ఉన్నారు. పైన్ గ్యాస్‌కు సంబంధించి 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న ఈ నౌక మార్చి 27 ఉదయం న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. ఇందులో 27 మంది నావికులు ఉన్నారు. గతంలో ‘శివాలిక్’, ‘నందాదేవి’ ఎల్పీజీ నౌకలతో పాటు, ‘జగ్ లాడ్కీ’ అనే ముడి చమురు నౌక, ‘జగ్ ప్రకాష్’ (గ్యాసోలిన్) నౌకలు కూడా ఈ సంక్షోభం మధ్యే సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి.
గల్ఫ్‌లో ఇంకా 20 భారత నౌకలు..
తాజాగా రెండు నౌకలు బయటపడటంతో, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ నౌకల సంఖ్య 20కి (వీటిలో 5 ఎల్పీజీ నౌకలు) చేరింది. వీటిలో సుమారు 540 మంది భారతీయ నావికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే వివిధ దేశాలకు చెందిన సుమారు 500 ట్యాంకర్లు ఈ గల్ఫ్ ప్రాంతంలోనే నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు వస్తున్నాయి. కాగా, గల్ఫ్‌లో సిద్ధంగా ఉన్న మరో ఆరు ఎల్పీజీ ట్యాంకర్లను హర్మూజ్ మీదుగా దాటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతో చురుగ్గా చర్చలు జరుపుతోంది. ఈ నౌకలకు అనుమతి లభిస్తే భారత్‌కు అదనంగా మరో 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వస్తుంది. తమ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తటస్థ దేశాల నౌకలు హర్మూజ్ మీదుగా వెళ్లొచ్చని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకటించడం, ఇరాన్ అధికారులు సానుకూలంగా స్పందిస్తుండటంతో రాబోయే రోజుల్లో మిగిలిన నౌకలు కూడా సురక్షితంగా భారత్ చేరుకుంటాయని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.






