విమానయాన రంగానికి కేంద్రం ఊరట.. రూ.10 వేల కోట్లతో ఇంధన ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

by Kema Shiva Kumar |

విమాన ఇంధన (ATF) ధరల విపరీత పెరుగుదల నుంచి దేశీయ విమానయాన రంగాన్ని, ప్రయాణికులను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ రూ.10,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఆమోదించింది.

విమానయాన రంగానికి కేంద్రం ఊరట.. రూ.10 వేల కోట్లతో ఇంధన ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన రంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనం (ATF) ధరల్లో వస్తున్న మార్పుల నుంచి విమాన సంస్థలను, ప్రయాణికులను రక్షించేందుకు రూ.10,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి (Price Stabilization Fund) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పశ్చిమాసియా (Middle East)లో జరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మార్చి 2026 లో లీటరు రూ.60.5గా ఉన్న ఇంధన ధర, కేవలం రెండు నెలల్లోనే రూ.142కి చేరింది. విమాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధనానికే 40 శాతం నుండి 60 శాతం వరకు ఖర్చవుతుంది. ఈ ధరల పెరుగుదల వల్ల విమాన సంస్థలు, ఆయిల్ కంపెనీలు (OMCs) తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

దీంతో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ ద్వారా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) రూ.10,000 కోట్ల వడ్డీ లేని అడ్వాన్స్‌ను బడ్జెట్ మద్దతుగా అందిస్తుంది. ఈ సదుపాయం దేశంలోని అన్ని గుర్తింపు పొందిన విమాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు ఇది వర్తిస్తుంది. ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా విమాన సంస్థలకు ఒక స్థిరమైన ధరకే ఇంధనం లభిస్తుంది. భవిష్యత్తులో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు, ఆ వ్యత్యాస సొమ్మును ఆయిల్ కంపెనీల నుంచి వసూలు చేసి తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. ఈ పథకం 36 నెలల పాటు అమలులో ఉండనుండగా.. దీనిపై ప్రతి ఏటా సమీక్ష నిర్వహించనున్నారు.

Next Story