Akhilesh Yadav:అసలైన లెక్క చెప్పండి.. కుంభమేళా తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?

by Shamantha N |   (  Updated:2025-02-04 13:22:18  IST  )

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్‌లో రభస జరిగింది. ఈ ఘటనలో మరణాల లెక్కలు దాస్తున్నారని ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్(Samajwadi Party Chief Akhilesh Yadav) డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారుపై మండిపడ్డారు.

Akhilesh Yadav:అసలైన లెక్క చెప్పండి.. కుంభమేళా తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?
X

దిశ, నేషనల్ బ్యూరో: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్‌లో రభస జరిగింది. ఈ ఘటనలో మరణాల లెక్కలు దాస్తున్నారని ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్(Samajwadi Party Chief Akhilesh Yadav) డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh Chief Minister) ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపైనా మండిపడ్డ ఆయన.. తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?.. అసలైన లెక్క బయటపెట్టండి.. అంటూ ప్రసంగించారు. రాష్ట్రపతి చేసిన బడ్జెట్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంట్‌ మంగళవారం కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలోనే.. కుంభమేళా ఘటనపై అఖిలేష్‌ యాదవ్‌ ప్రసంగించారు. ‘‘మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరం. యూపీ ప్రభుత్వం 30 మంది చనిపోయారని, 60 మందికి గాయాలయ్యాయని చెబుతోంది. కానీ, విపక్షాలు ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నాయని అంటున్నాయి. బడ్జెట్‌ విషయంలో సరైన లెక్కలు చెప్పే ఈ ప్రభుత్వం.. కుంభమేళా మరణాల సంఖ్యను మాత్రం ఎందుకు దాస్తోంది. అసలు ఈ దుర్ఘటనకు బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు” అని అఖిలేష్‌ ప్రశ్నించారు.

కుంభమేళా తొక్కిసలాట

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించాలన్నారు. మరణాలు, గాయపడ్డవాళ్లు, వాళ్లకు అందుతున్న చికిత్స, అక్కడి వైద్య సిబ్బంది, రవాణా సదుపాయలు, వైద్యం.. ఇలా అన్నింటి గురించి చర్చ జరగాలన్నారు. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపే వరకు యోగి సర్కార్‌ సంతాపం ప్రకటించకపోవడంపైనా అఖిలేష్‌ విరుచుకుపడ్డారు. అలాగే.. పెట్టుబడుల విషయంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల ఇంజిన్లు మాత్రమే కాదు.. భోగీలు కూడా ఢీ కొట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు, జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం దగ్గర అమృతస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. అఖాడా ఘాట్‌ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు మృతి చెందగా, గాయపడ్డవాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో పుణ్య స్నానాలు యథాతధంగా కొనసాగాయి. చివరకు.. ఘటనలో 30 మంది మరణించినట్లు అక్కడి పోలీసు అధికారులు సాయంత్రం ప్రకటించారు.


Read Also..

ఫతేపూర్ లో ఘోర రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ

Next Story