Gujarat HC: హిందూ వివాహానికి కేవలం రిజిస్ట్రేషన్ సరిపోదు

by S Gopi |

ఈ కేసులో మహిళ కూడా వివాహానికి సంబంధించిన ఎలాంటి ఆచారాలు, క్రతువులు జరగలేదని అంగీకరించినప్పటికీ, ఫ్యామిలీ కోర్టు వివాహాన్ని చెల్లుబాటు అయ్యిందిగా పరిగణించడం తప్పని హైకోర్టు పేర్కొంది.

Gujarat HC: హిందూ వివాహానికి కేవలం రిజిస్ట్రేషన్ సరిపోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: హిందూ వివాహ వ్యవస్థకు సంబంధించి గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే కేవలం వివాహ రిజిస్ట్రేషన్ సరిపోదని, సప్తపది వంటి సంప్రదాయ ఆచారాలు తప్పనిసరిగా జరగాలని గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వివాహ చట్టం–1955లోని సెక్షన్ 7 ప్రకారం, ఇరు పక్షాల సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుకలు నిర్వహించడమే చట్టబద్ధ వివాహానికి పునాదిగా కోర్టు స్పష్టం చేసింది. యూకేలో నివసిస్తున్న ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ కేసులో మహిళ కూడా వివాహానికి సంబంధించిన ఎలాంటి ఆచారాలు, క్రతువులు జరగలేదని అంగీకరించినప్పటికీ, ఫ్యామిలీ కోర్టు వివాహాన్ని చెల్లుబాటు అయ్యిందిగా పరిగణించడం తప్పని హైకోర్టు పేర్కొంది. వివాహ పత్రాలపై మోసపూరితంగా సంతకాలు తీసుకున్నారని, తాను ఎప్పుడూ వివాహం చేసుకోలేదని అప్పీలుదారుడు చేసిన వాదనలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

తీర్పులో న్యాయస్థానం హిందూ వివాహం ప్రాముఖ్యతపై కూడా విస్తృత వ్యాఖ్యలు చేసింది. సప్తపది(ఏడడుగులు) వంటి ఆచారాలు కేవలం సంప్రదాయాలు మాత్రమే కాకుండా, వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన గుర్తింపును ఇచ్చే పవిత్ర సంస్కారాలని పేర్కొంది. వివాహం అనేది కేవలం పాటలు, నృత్యాలు, విందులు లేదా ఒక సామాజిక వేడుక మాత్రమే కాదని, ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సమానత్వం, పరస్పర గౌరవం, బాధ్యతతో కూడిన బంధంలోకి ప్రవేశించే పవిత్ర ఘట్టమని హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, అందుకే యువత వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు దాని చట్టపరమైన, సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలని కోర్టు సూచించింది. అలాగే, భౌగోళిక, ప్రాంతీయ సంప్రదాయాలు మారినా, వివాహ ఆచారాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యం మాత్రం ఒకటేనని తన తీర్పులో వెల్లడించింది.

Next Story