గోవా అగ్నిప్రమాదానికి కారణాలు ఇవేనా?

by Naga Rani Yarlagadda |

గోవాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. పనాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని

గోవా అగ్నిప్రమాదానికి కారణాలు ఇవేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: గోవాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. పనాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని అర్పొర గ్రామంలో ఉన్న ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో 25 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలై పోరాడుతున్నారు. శనివారం రాత్రి ‘బాలీవుడ్ బ్యాంగర్ నైట్’ జోరుగా సాగుతోంది. క్లబ్‌లో సుమారు వంద మంది పార్టీ చేసుకుంటున్న సమయంలో డ్యాన్స్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ, గందరగోళంలో కొందరు బయటకు పరుగులు తీశారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవాలని కింది అంతస్తులోని వంటగదిలోకి దూరారు. కానీ అదే వారి పాలిట మృత్యువుగా మారింది. ఊపిరి ఆడక, అక్కడే పర్యాటకులతో పాటు క్లబ్ సిబ్బంది ప్రాణాలు విడిచారు.

క్లబ్‌కు వెళ్లే రోడ్డు అత్యంత ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి 400 మీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. తాటాకులతో తాత్కాలికంగా కట్టిన నిర్మాణం కారణంగా మంటలు క్షణాల్లో చెలరేగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా షేక్ అనే యువతి ఈ ప్రమాదం నుంచి బయటపడగా, “అక్కడ ఉన్న ప్రతి నిర్మాణం తాటాకులతోనే ఉంది. మంటలు వ్యాపించడానికి ఎక్కువ సమయం పట్టలేదు” అని భయానక దృశ్యాలను గుర్తుచేసుకుంది. ఈ క్లబ్ పూర్తిగా అక్రమ నిర్మాణమని, భాగస్వాముల మధ్య వివాదాలు కూడా ఉన్నాయని అర్పొర-నగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్ వెల్లడించారు.

పంచాయతీ గతంలోనే కూల్చివేత నోటీసులు జారీ చేసినా, పంచాయతీ డైరెక్టరేట్ ఆదేశాలతో ఆ చర్యలు నిలిపివేశామని ఆయన తెలిపారు. ఈ నిర్లక్ష్యమే ఈ రోజు 25 మంది ప్రాణాలను బలితీసుకుందనే ఆగ్రహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ దారుణ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం సావంత్, ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులే కాగా, కొన్ని మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. గోవాకు టూరిజం రాజధానిగా పేరున్న నేపథ్యంలో ఈ ప్రమాదం రాష్ట్రానికి పెద్ద దెబ్బగా మారింది.

Next Story