Fact Check : పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిపై ఆర్‌బీఐ కొత్త రూల్స్? కేంద్రం స్పష్టీకరణ

by Ramesh Naini |

రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియాలో, పలు పత్రికల్లో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Fact Check : పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిపై ఆర్‌బీఐ కొత్త రూల్స్?  కేంద్రం స్పష్టీకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియాలో, పలు పత్రికల్లో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని తేల్చిచెప్పింది. ఈ వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం విచారణ జరిపి స్పష్టతనిచ్చింది. పాత నోట్ల మార్పిడిపై ఆర్‌బీఐ కొత్త రూల్స్ తెచ్చినట్లు వైరల్ అవుతున్న వార్తా కథనంపై ‘ఫేక్ (FAKE)’ అని స్టాంప్ వేసి ఉన్న ఫోటోను తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది. ‘ఆర్‌బీఐ పాత నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి కొత్త నిబంధనలు జారీ చేయలేదు. ఈ వాదన పూర్తిగా అవాస్తవం’ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ స్పష్టం చేసింది.

అధికారిక వెబ్‌సైట్‌నే నమ్మండి..

ఆర్థిక నిబంధనలు, కరెన్సీకి సంబంధించిన అధికారిక ప్రకటనలు, అప్‌డేట్స్ కోసమైనా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://rbi.org.inను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు సూచించారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఎలాంటి సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దని, కేవలం నమ్మకమైన అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని ప్రజలను అప్రమత్తం చేశారు.

అనుమానం వస్తే ఫిర్యాదు చేయండిలా..

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీకు ఏదైనా అనుమానాస్పద సందేశం, వార్త, ఫోటో లేదా వీడియో వస్తే, వాటిలోని వాస్తవాలను నిర్ధారించుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందాన్ని సంప్రదించవచ్చు. దీని కోసం వాట్సాప్ నంబర్: +91 8799711259, ఈ-మెయిల్: [email protected] లను సంప్రదించాలని పీఐబీ సూచించింది.

Next Story