FLASH NEWS: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ రద్దు

by Naga Rani Yarlagadda |

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. ఆ బ్యాంక్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

FLASH NEWS: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం ప్రకటించింది. నిబంధనల ఉల్లంఘన, పదేపదే హెచ్చరించినా మారకపోవడం, డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. దీంతో పేటీఎం బ్యాంక్ ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీల్లేకుండా పోయింది.

డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాపారం

పేటీఎం బ్యాంక్ యాజమాన్య తీరు, కార్యకలాపాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ వ్యవహారాలు కొనసాగిస్తే డిపాజిటర్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే బ్యాంకును మూసివేసే (Winding up) ప్రక్రియను ప్రారంభించడానికి సంబంధిత హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

గతంలో తీసుకున్న చర్యలు

నిజానికి ఆర్‌బీఐ పేటీఎం బ్యాంక్‌పై ఆంక్షలు గతంలోనే విధించింది. మార్చి 11, 2022 నుండే కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్‌బీఐ ఆదేశించింది. మార్చి 2024లో కొత్త డిపాజిట్లు, వాలెట్లు, ఫాస్టాగ్ (FASTag), ఎన్‌సీఎమ్‌సీ (NCMC) కార్డుల్లో టాప్-అప్‌లను పూర్తిగా నిలిపివేసింది. కేవైసీ (KYC) నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ ఆర్థిక కార్యకలాపాలపై ఉన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.

డిపాజిటర్ల పరిస్థితి ఏంటి?

బ్యాంక్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిటర్లందరికీ తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు నిల్వలు (Liquidity) పేటీఎం బ్యాంక్ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ కేవలం పాత డిపాజిట్ల విత్‌డ్రాయల్స్, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా లోన్ రెఫరల్స్‌కు మాత్రమే పరిమితమైంది. కొత్తగా ఎలాంటి డిపాజిట్లను స్వీకరించడానికి అనుమతి లేదు. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలో 2017లో ప్రారంభమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమై చివరకు తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది.

Next Story