ఒడిశాలో ‘రథయాత్ర’ వివాదం తీవ్రం: ‘ఇస్కాన్’కు కలింగ సేన మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-11 09:05:37  IST  )

ఒడిశాలో జగన్నాథుని అకాల రథయాత్రల నిర్వహణపై ఇస్కాన్ సంస్థకు, కలింగ సేనకు మధ్య పంచాయితీ ముదిరింది.

ఒడిశాలో ‘రథయాత్ర’ వివాదం తీవ్రం: ‘ఇస్కాన్’కు కలింగ సేన మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథుని క్షేత్ర రథయాత్ర నిర్వహణ సమయం (Timing)పై ఇస్కాన్, స్థానిక సామాజిక-రాజకీయ సంస్థ ‘కలింగ సేన’ మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరింది. సాంప్రదాయ క్యాలెండర్‌కు విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధమైన సమయాల్లో ‘ఇస్కాన్’ సంస్థ రథయాత్రలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ కలింగ సేన ఒడిశా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌లోని ఇస్కాన్ ఆలయం వెలుపల కలింగ సేన శ్రేణులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

అయితే, పూరీ జగన్నాథ సంస్కృతి ప్రకారం ఏటా నిర్దేశిత తిథి, సమయాల్లో మాత్రమే రథయాత్ర నిర్వహిస్తారు. కానీ ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తమకు నచ్చిన సమయాల్లో ఉత్సవాలను జరుపుతోందని కలింగ సేన ఆరోపిస్తోంది. శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా ఒకే షెడ్యూల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రథయాత్రలు నిర్వహించాలని పూరీ గజపతి మహారాజా దిబ్యసింగ్ దేబ్ చేసిన విజ్ఞప్తిని ఇస్కాన్ తోసిపుచ్చిందని కలింగ సేన మండిపడుతోంది. జగన్నాథుని ప్రథమ సేవకుడిగా భావించే గజపతి మహారాజాని ఇస్కాన్ అవమానించిందంటూ వారు ఫైర్ అవుతున్నారు.

పూరీలోకి ‘ఇస్కాన్’ భక్తులకు నో ఎంట్రీ..

ఈ సందర్భంగా కలింగ సేన అధ్యక్షుడు హేమంత్ రథ్ మీడియాతో మాట్లాడుతూ ఇస్కాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ జగన్నాథ సంస్కృతిని గౌరవించని ఇస్కాన్ సంస్థకు ఒడిశాలో ఉండే హక్కు లేదని అన్నారు. జులై 16న పూరీలో జరగబోయే అధికారిక జగన్నాథ రథయాత్రలో ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు ఎవరూ పాల్గొనకుండా మా కార్యకర్తలు అడ్డుకుంటారని.. వారిని పూరీ సరిహద్దుల్లోకి కూడా రానివ్వబోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ సంస్కృతిని గౌరవించనప్పుడు, తాము వారిని పూరీలో ఎందుకు గౌరవించాలని ప్రశ్నించారు. ఏది ఏమైనా.. జులై 16న పూరీ రథయాత్ర జరగనున్న నేపథ్యంలో ఒడిశాలో ఈ వివాదం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Next Story