స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. తమిళనాడులో ప్లాన్-బి రాజకీయాలు షురూ!

by Prasad Jukanti |

తమిళనాడులో విజయ్ ప్రభంజనం సృష్టించిన వేళ, మాజీ సీఎం స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది డీఎంకే ప్లాన్-బిలో భాగమేనా? అనే చర్చ కూడా జరుగుతోంది.

స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. తమిళనాడులో ప్లాన్-బి రాజకీయాలు షురూ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాలు పూట పూటకు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న వేళ ప్రముఖ నటుడు రజనీకాంత్ (Rajinikanth) మాజీ ముఖ్యమంత్రి డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్‌ను (M.K Stalin) కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎన్నికల ఓటమి నేపథ్యంలో స్టాలిన్‌కు మద్దతుగా కలిశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించిన విజయ్ పార్టీ తనకు మద్దతు కూడగట్టుకుంటున్న సమయంలో ఈ భేటీ జరగడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

డీఎంకేతో సంబంధాలు:

పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే విజయ్ (Vijay TVK) ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడం యావత్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న రజనీకాంత్ గత 30 ఏళ్లుగా పొలిటికల్ ఎంట్రీపై ముందుకు వెనక్కి అవుతూనే ఉన్నారు. 1995లో ఆయన కాంగ్రెస్‍లో చేరి రాజకీయాల్లోకి వస్తారని అంతా భావించినప్పటికీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకుండా నాడు డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం సైతం చేశారు. 1998 లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆయన ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. రజనీకాంత్ ఆ తర్వాత 2017లో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించి, 2021లో ఆరోగ్య కారణాలతో వైదొలిగారు.

ప్లాన్ -బి లో భాగమేనా?:

అయితే విజయ్ గెలుపు చూశాక రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఉండే ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవారనే అసంతృప్తి రజనీ ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతోంది. అయితే సినీ రంగానికి చెందిన విజయ్ ను ప్రస్తుతం తమిళ మీడియా మరో ఎంజీఆర్ గా ప్రశంసిస్తోంది. ఇటువంటి తరుణంలో రజనీకాంత్ స్టాలిన్ తో భేటీ కావడం వెనుక ఏదైనా ప్లాన్ -బి వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ కారణంగా తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపే మళ్లకుండా భవిష్యత్ వ్యూహంలో భాగంగా రజనీకాంత్-స్టాలిన్ ఏదైనా చర్చించుకున్నారా? ప్రస్తుతం కాంగ్రెస్ డీఎంకే బంధానికి బీటలు వారుతున్న తరుణంలో స్టాలిన్ రజనీ రూపంలో మరో సంచలనానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేద విజయ్ విషయంలో తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా రజనీకాంత్ ఏదైనా ప్రణాళికతో ఉన్నారా అనేది ద్రవిడ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

Next Story