పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి.. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

by Ajay Maddhiboyina |

బాలికలను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి.. వారికి చైనా మొబైల్స్ గిఫ్టుగా ఇచ్చి ఆ తర్వాత లైంగిక దాడులకు పాల్పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి.. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
X

- బలవంతపు మతమార్పిడికై ప్రయత్నం?

- ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు

- రాజస్థాన్‌లోని బీవార్ జిల్లాలో ఘటన

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని బీవార్ జిల్లా మసూద పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు చూపించి బలవంతపు మతమార్పిడికి ప్రయత్నించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక వర్గానికి చెందిన యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి.. మరో వర్గం బాలికలపై ఒక ప్రణాళిక ప్రకారం లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. లక్ష జనాభా ఉన్న మసూద గ్రామంలో లైంగిక దాడుల కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక మార్కెట్లను మూసేయడమే కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ర్యాలీలు నిర్వహించారు. కాగా ఈ కేసులో ఒక మాజీ కౌన్సిలర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. లైంగిక దాడులు, బ్లాక్ మెయిల్, బలవంతపు మత మార్పిడుల ఆరోపణలపై పోలీసులు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు.

బాలికలను సోషల్ మీడియా ద్వారా సంప్రదించి.. వారికి చైనా మొబైల్స్ గిఫ్టుగా ఇచ్చి ఆ తర్వాత లైంగిక దాడులకు పాల్పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా, వీరిలో కొంత మంది బాలికలను బ్లాక్ మెయిల్ చేసి మత మార్పిడులకు ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు. మాజీ కౌన్సిలర్ హకీమ్ ఖురేషీని ఈ కేసులో అరెస్టు చేసినట్లు మసూద డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. అతడిని కోత్డా కోర్టు అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే ఈ లైంగిక దాడుల వెనుక మతపరమైన కోణం కూడా ఉందని తెలిసిన వెంటనే బీవార్ జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కేసులో నిందితులంతా ఒకే వర్గానికి చెందిన వారు కావడం.. బాలికలు వేరే వర్గానికి చెందిన వారు కావడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. కాగా, ఈ రాకెట్‌లో 14 నుంచి 15 మంది యువకులు, బాలురు ఉన్నారని.. తన క్లాస్‌కు చెందిన ఐదుగురు బాలికలతో పాటు.. మరో ముగ్గురు బాలికలను కూడా టార్గెట్ చేశారని ఒక బాధితురాలు వెల్లడించింది.

నిందితుల దగ్గర బతికి ఉన్న బాలికల ఫొటోలు ఏవీ లేవని, వారి ఫోన్లను ఇప్పటికే స్వాధీనం చేసుకొని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రెండు బాధిత కుటుంబాలు ఫిబ్రవరి 16న మొదట పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత మరో మూడు బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు పెట్టారు. కాగా, బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోత్ విమర్శించారు. ఇలాంటి అభద్రతాభావ పరిస్థితుల్లో ఆడపిల్లలు తమ ఇంటిని దాటి బయటకు వెళ్లగలరా అని గెహ్లోత్ ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనలో ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పోలీసులు ఆధారాలను సేకరించడానికి రంగంలోకి దిగారు. బీవార్ జిల్లాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Next Story