చిరిగిన 10 రూపాయల నోటు రాజా రఘువంశీ కేసు కథనే మారుస్తుందా? సోనమ్ సోదరుడిపై అనుమానం..!

by Bhanu |

ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసు ఒక త్రికోణప్రేమ చుట్టూ తిరుగుతున్నదని ఇప్పటివరకు భావించారు. కానీ ఇప్పుడు ఈ కేసు అసలు రూట్ మరో దిశలో పయనిస్తోంది.

చిరిగిన 10 రూపాయల నోటు రాజా రఘువంశీ కేసు కథనే మారుస్తుందా? సోనమ్ సోదరుడిపై అనుమానం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసు ఒక త్రికోణప్రేమ చుట్టూ తిరుగుతున్నదని ఇప్పటివరకు భావించారు. కానీ ఇప్పుడు ఈ కేసు అసలు రూట్ మరో దిశలో పయనిస్తోంది. ఈ హత్య వెనక ఉన్న మిస్టరీని ఓ పాత 10 రూపాయల చిరిగిన నోటు తిప్పి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఆధారాల ప్రకారం, ఈ కేసులో సోనమ్ రఘువంశీ సోదరుడు గోవింద్ రఘువంశీపై అనుమానాలు పెరుగుతున్నాయి. క్రైం బ్రాంచ్ హఠాత్తుగా గోవింద్‌ను విచారణకు పిలవడంతో కేసులో కొత్త మలుపు వచ్చిందని తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. సోనమ్ ప్రేమికుడు రాజ్ కుశ్వాహా మొబైల్ ఫోన్‌ లో పాత చిరిగిన పది రూపాయల నోట్ల ఫొటోలు పోలీసులకు లభించాయి. ఇవి సాధారణ నోట్లు కావు.. హవాలా లావాదేవీలకు “కోడ్” గా ఉపయోగించే ఆధారాలు. ఈ ఫోటోలు హవాలా నెట్‌వర్క్ లో సంకేతాలుగా పనిచేస్తాయి. దీనివల్ల కోట్లు రూపాయల అక్రమ లావాదేవీలు జరగడంతో పాటు, ఈ హత్య వెనక ఉన్న కారణాలు వేరే కోణంలోకి వెళ్లిపోయాయి.

రాజ్ కుశ్వాహా విచారణలో హవాలా వ్యాపారంలో తనతో పాటు సోనమ్, గోవింద్ కూడా భాగస్వాములని ఒప్పుకున్నాడు. దీని ద్వారా సోనమ్, గోవింద్ కలిసి తమ బంధువు జితేంద్ర రఘువంశీ ఖాతాల ద్వారా భారీగా డబ్బులు లావాదేవీ చేసినట్లు పోలీసులకు స్పష్టం అయింది. కొన్ని బ్యాంక్ ఖాతాల్లో 14 లక్షల వరకు డిపాజిట్‌లు, విత్‌డ్రా ట్రాన్సాక్షన్లు ఉన్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయి.

ఈ మొత్తం డేటాను.. డిజిటల్ ఆధారాలు, నగదు లావాదేవీల వివరాలు.. ఇండోర్ క్రైం బ్రాంచ్ తాజాగా ఈడీకి అప్పగించింది. దీంతో ఈ కేసు ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలోకి మళ్లింది. గోవింద్ వ్యాపారం.. శ్రీ బాలాజీ అక్‌టిరియో (ప్లైవుడ్, లామినేషన్ వ్యాపారం).. ఈ హవాలా దందాకు కవచంలా ఉపయోగపడిందన్న అనుమానంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.

గోవింద్ కార్యాలయం, గోదాముల్లో పోలీసులు దాడులు నిర్వహించగా అనుమానాస్పద పత్రాలు లభించాయి. అంతేకాదు, అక్కడ పని చేస్తున్న సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. గోవింద్ బహిరంగంగా సోనమ్‌తో సంబంధాలు తెగినట్టు ప్రకటించినా, పోలీసులు మాత్రం అతని వ్యాపార కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచారు.

ఒక త్రికోణప్రేమ కథనంగా మొదలైన ఈ హత్య కేసు, ఇప్పుడు ఆర్థిక నేరాల అంధకార గుహల్లోకి దూసుకెళ్తోంది. చిరిగిన నోట్ల ఆధారం, హవాలా నెట్‌వర్క్ లింక్, మనీ లాండరింగ్ కోణం.. ఇవన్నీ కలిసి ఈ కేసును మరింత మిస్టరీగా మలుస్తున్నాయి. నిజం బయట పడేదాకా, కేసు మరో మలుపు తిరుగుతుందా అన్నది చూడాల్సిందే.

Next Story