- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్‌భవన్ వర్సెస్ అసెంబ్లీ: తమిళనాడు సర్కారు ఏర్పాటులో అసలు చిక్కు ఎక్కడ?
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనిశ్చితి నెలకొన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనిశ్చితి నెలకొన్నది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు అవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ ఆహ్వానించకపోవడంపై మరోసారి గవర్నర్పాత్ర, వారి తీరుపై చర్చ మొదలైంది. కొన్ని పార్టీలు, న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు గవర్నర్తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గవర్నర్లువ్యవహరించిన తీరు, సుప్రీంకోర్టు దేశంలోని వివిధ రాష్ట్రాల ఏర్పాటుపై ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తున్నారు. గతంలో వివిధ సందర్భాల్లో సింగిల్ లార్జెస్ట్పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడిన కూటములకు అవకాశాలు కల్పించారు. దీంతో ఒక విధానం అనేది లేకుండా, గవర్నర్‌ల ఇష్టాఇష్టాలకు అనుగుణంగా, కేంద్రంలో ప్రభుత్వ పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా గవర్నర్‌లు వింటున్నారనే విమర్శలు రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణుల నుంచి వస్తున్నాయి. గతంలో అనేక సందర్భాల్లో గవర్నర్‌ల తీరుపై, వారి నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసి వారి నిర్ణయాలను తప్పు పట్టింది. నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది.
గవర్నర్ తీరుపై అభ్యంతరాలు
మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకోవాలని, రాజ్‌భవన్‌లో కాదంటూ సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నియమించిన గవర్నర్‌ల విషయంలో స్పష్టం చేసింది. అయినా గత అనుభవాలు, సుప్రీంకోర్టు తీర్పులు ఎన్ని ఉన్నా.. తమిళనాడు విషయంలో గవర్నర్వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం 234 సీట్లు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే టీవీకే పార్టీ 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మరొక 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్మద్దతు ప్రకటించింది. కానీ గవర్నర్ మాత్రం 118 బలాన్ని తనకు రాజ్‌భవన్‌లో చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని చెబుతున్నారు. అక్కడ టీవీకే తరువాత ఎక్కువ స్థానాలు గెలిచిన డీఎంకే విజయ్‌కే ప్రమాణస్వీకార అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయినా కూడా గవర్నర్ మాత్రం స్పందించడం లేదు.
గవర్నర్ చర్య సరైనదే : మాడభూషి శ్రీధర్, ఆర్టీఐ మాజీ చీఫ్‌కమిషనర్
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అక్కడి గవర్నర్తీసుకుంటున్న చర్యలు సరైనవే. గతంలో సర్కారియా కమిషన్, పూంచ్కమిషన్ సిఫార్సులకు అనుగుణంగానే ఆయన నిర్ణయం ఉన్నది. విజయ్‌కు సరైన మెజార్టీ ఉన్నది డాక్యుమెంట్ల రూపంలో చూపించాలని అడుగుతున్నారు. ఇందులో తప్పేంలేదు. సర్కారియా కమిషన్ సిఫార్సులు, పూంచ్ కమిషన్ సిఫార్సులను చదవితే దీనిపై స్పష్టత వస్తుంది. విజయ్‌కు మెజార్టీ ఉన్నది లేనిది తెలుసుకోకుండానే ప్రభుత్వ ఏర్పాటుపై అవకాశం కల్పిస్తే ప్రభుత్వ ఏర్పాటుతో ఎమ్మెల్యేల కొనుగోలు జరిగే అవకాశం ఉందని ఆరోపణలు వస్తాయి. సింగిల్ లార్జెస్ట్పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని ఎక్కడా లేదు. ఒకప్పుడు ఆ విధంగా ఉండేది. ఆ తరువాత ఆ పరిస్థితి మారింది.
శాసనసభలోనే తేల్చాలి : ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజకీయ విశ్లేషకులు
గతంలో ఎమ్మెల్యేల బలాబలాలు రాజ్‌భవన్‌లో తేల్చేవారు. కానీ 1994లో సుప్రీంకోర్టు ఎస్‌ఆర్ బొమ్మై కేసులో బలాబలాలు రాజ్‌భవన్‌లో కాదు శాసనసభలో తేల్చాలని తీర్పు ఇచ్చింది. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం గవర్నర్బాధ్యత. విజయ్ సింగిల్లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు. తమిళనాడులో ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల ఫలితాల తరువాత కానీ ఏర్పడిన కూటమిగా ఏ పార్టీ ఏర్పడలేదు. విజయ్ పార్టీ కాకుండా మరే పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. విజయ్‌ని ప్రమాణస్వీకారం చేయించమని డీఎంకే స్పష్టంగా చెప్పింది. గతంలో వాజ్‌పాయ్‌ను కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్శర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ప్రమాణస్వీకారం చేయించారు. 13 రోజుల తరువాత ఆయన బలనిరూపణ చేసుకోకపోవడంతో ప్రభుత్వం దిగిపోయింది. 2018లో కర్ణాటకలో సింగిల్లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ నేత యెడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ఎన్నికల తరువాత కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, జేడీఎస్‌ల పొత్తును గవర్నర్ ఆమోదించలేదు.






