తొక్కిసలాటలో కుట్ర కోణంపై విచారణ

by Ajay Maddhiboyina |

ఇప్పటికే ఈ కమిటీకి తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి ఫుటేజీని అందించారు. దర్యాప్తులో సేకరించిన విషయాలను కూడా విచారణ కమిటీకి అందించనున్నారు.

తొక్కిసలాటలో కుట్ర కోణంపై విచారణ
X

- ఎవరైనా ఫేక్‌న్యూస్ స్ప్రెడ్ చేశారా?

- రైల్వే స్టేషన్‌లో అసలు ఏం జరిగిందని కూడా విచారణ

- వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్

దిశ, నేషనల్ బ్యూరో: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఏదైనా కుట్ర కోణం ఉందా అని విచారుస్తున్నాము. కావాలని ఎవరైనా ఫేక్‌న్యూస్ స్ప్రెడ్ చేసి తొక్కిసలాటకు కారణమయ్యారా అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజూందార్ ఆదివారం తెలిపారు. 'ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగింది చాలా బాధాకరమైన ఘటన. మా ప్రభుత్వం ఈ విషయంలో చాలా విచారిస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అని విచారిస్తోంది. ఈ దుర్ఘటనను సాకుగా చూపి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీద బురద జల్లడం సరికాదు. ఆయన ఆ స్థానానికి అత్యంత అర్హుడు'అని మంత్రి సుకాంత చెప్పారు. ఇప్పటికే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై రైల్వే శాఖ ఇద్దరు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నార్తరన్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కమిటీకి తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి ఫుటేజీని అందించారు. దర్యాప్తులో సేకరించిన విషయాలను కూడా విచారణ కమిటీకి అందించనున్నారు. కాగా.. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్షను రైల్వే శాఖ పరిహారంగా ప్రకటించింది.

Next Story