ఓట్ చోరిపై మరోసారి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

by Malleboina Mahesh |

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఓట్ చోర్-గద్దీ చోడ్' పేరుతో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహా ర్యాలీ నిర్వహించింది.

ఓట్ చోరిపై మరోసారి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఓట్ చోర్-గద్దీ చోడ్' పేరుతో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం 'ఓటు చోరీ'కి పాల్పడిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఎన్నికల సమయంలో రూ. 10 వేలు పంపిణీ చేశారని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఇది భారత రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి అని అభివర్ణించారు. ఎన్నికల సంఘం (ECI) బీజేపీతో కుమ్మక్కై పనిచేస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చట్టాన్ని మార్చి ఎన్నికల కమిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలు కల్పించారని ఆయన ఆరోపించారు. ఒకే ఇంట్లో 500-600 మంది ఓటర్లు ఉండటం, యూపీ నాయకులు హర్యానాలో ఓటు వేయడం, ఓటర్ల జాబితాలో బ్రెజిలియన్ మహిళ ఉండటం వంటి అంశాలపై తాము ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

అలాగే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మోహన్ భాగవత్ ఆలోచన ప్రకారం "ప్రపంచం నిజాన్ని చూడదు, అధికారాన్నే చూస్తుంది" అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ భావజాలం ముమ్మాటికి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినదేనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశపు, హిందూ ధర్మం, ప్రతి మతం యొక్క సిద్ధాంతం ప్రకారం నిజమే అత్యంత ముఖ్యమైనది అని చెబుతున్నప్పటికీ, మోహన్ భాగవత్ మాత్రం నిజాన్ని అర్థం లేనిదిగా, అధికారాన్నే ముఖ్యమైనదిగా భావిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అంతిమంగా, భారతదేశంలో నిజమే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజాన్ని నిలబెట్టి, నిజాన్ని నమ్ముకునే తాము నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాన్ని దేశం నుండి తప్పిస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Next Story