Rahul Gandhi: మరోసారి రాహుల్ గాంధీ వర్సెస్ ఈసీ.. ఈసారి టార్గెట్ మహారాష్ట్ర సీఎం

by Prasad Jukanti |   (  Updated:2025-06-24 08:11:41  IST  )

ఈసీ పై రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: మరోసారి రాహుల్ గాంధీ వర్సెస్ ఈసీ.. ఈసారి టార్గెట్ మహారాష్ట్ర సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తూ ఉంటే వాటిని ఈసీ (Election Commission) కొట్టిపారేస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఎన్నికల సంఘాన్ని కార్నర్ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర (Maharashtra), గుజరాత్ ఓటర్ రోల్స్ పై ఇప్పటికే పలు సందర్భాల్లో ఈసీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సొంత నియోజకవర్గంలో 5 నెలల కాలంలోనే ఓటరు జాబితా 8 శాతం పెరిగిందని ఈ మేరకు ఓ న్యూస్ వెబ్ సైట్ కథనానికి సంబంధించిన స్క్రీన్ షార్టును ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొన్ని పోలింగ్ బూత్ లలో 20-50 శాతం పెరుగుదల ఉందని, గుర్తుతెలియని వ్యక్తులు ఓట్లు వేసినట్లు బీఎల్వోలు నివేదించారని ఆరోపించారు. ధృవీకరించబడిన చిరునామా లేకుండా వేలాది మంది ఓటర్లను మీడియా బయటపెట్టిందని ఇంత జరుగుతున్నా ఈసీ మాత్రం స్పందించకపోవడం ఇది మౌనమా లేక జరుగుతున్న వాటిని సమ్మతిస్తోందా అని నిలదీశారు. ఇది అవాంతరాలను దాచిపెట్టడం మాత్రమే కాదు ఇది ఓటు దొంగతనం, నేరాన్ని కప్పిపుచ్చుకోవడమేనని దుయ్యబట్టారు. అందుకే మెషిని రీడబుల్ డిజిటల్ ఓటర్ రోల్స్, సీసీటీవీ ఫుటేజీలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.

కాగా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లలోని సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటిని బహిర్గతం చేయడం అంటే ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తేల్చిచెప్పాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది.

Next Story