- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైశంకర్‌ను మళ్లీ టార్గెట్ చేసిన రాహుల్.. పాక్ మీడియాలో ప్రసారం!
జైశంకర్‌ను రాహుల్ గాంధీ మళ్లీ టార్గెట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు పాక్ మీడియాలో ప్రసారం కావడంతో బీజేపీ మండిపడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: విదేశాంగ మంత్రి జైశంకర్‌ను విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి టార్గెట్ చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ గురించి మీడియాతో మాట్లాడిన జైశంకర్.. ‘ఆపరేషన్ ఆరంభంలో మేం కేవలం ఉగ్రస్థావరాలనే టార్గెట్ చేస్తున్నట్లు పాకిస్తాన్‌కు చెప్పాం. కానీ వాళ్ల ఆర్మీ ఎదురు దాడి చేయడంతోనే మేం ప్రతిస్పందించాం’ అని చెప్పారు. ఇదే వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ‘భారత్ దాడి చేయడానికి ముందే పాకిస్తాన్‌కు సమాచారం అందించడం నేరం. భారత ప్రభుత్వం ఇదే పని చేసిందని విదేశాంగ మంత్రి ఒప్పుకున్నారు. ఇలా చెయ్యడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దీని వల్ల భారత వాయుసేన ఎన్ని విమానాలను కోల్పోయింది?’ అని ప్రశ్నించారు.
తన ప్రశ్నకు జైశంకర్ నుంచి నేరుగా సమాధానం రాకపోవడంతో రాహుల్ మరోసారి విదేశాంగ మంత్రిని టార్గెట్ చేశారు. ‘ఈ విషయంలో ఈఏఎం జైశంకర్ మౌనం చాలా దారుణమైన విషయం. నేను మళ్లీ అడుగుతున్నా.. పాకిస్తాన్‌కు విషయం తెలియడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం? ఇది పొరపాటు కాదు. నేరం. దేశానికి నిజం తెలియాలి’ అంటూ మళ్లీ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.
అయితే జైశంకర్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుగా ప్రచారం చేస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ గుర్తుచేసింది. ‘ఆపరేషన్ సిందూర్ మొదలైన వెంటనే మేం పాక్‌కు సమాచారం అందించాం. ఉగ్రస్థావరాలను టార్గెట్ చేయాల్సిన పరిస్థితిలో తామున్నామని చెప్పాం. కానీ ఎదురు దాడి తప్పదని పాక్ దళాలు చెప్పాం. మేం అప్పటికే సిద్ధంగా ఉన్నాం’ అని ఘాయ్ చెప్పారు. ఇదే విషయాన్ని జైశంకర్ కూడా చెప్పారని, ఈ వ్యాఖ్యలను రాహుల్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
జైశంకర్‌కు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం ఏంటని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా నిలదీశారు. ఎలాంటి సంబంధం లేకుండా ఉగ్రస్థావరాలను టార్గెట్ చేయబోతున్నట్లు పాకిస్తాన్‌కు ఎందుకు చెప్తారని ఆయన ప్రశ్నించారు. ఇది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసినట్లేనని మండిపడ్డారు. ఇలా ముందుగానే జైశంకర్ సమాచారం ఇవ్వడం వల్లనే మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు ప్రాణాలతో తప్పించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘రాహుల్ ఎవరో చెప్తే ఇలా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. విదేశాల్లో ఉండగా జైశంకర్‌ను రాహుల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దౌత్య బృందాలను విదేశాలకు వెళ్లే సమయంలో ఇలా చేయడం ఏంటి?’ అని బీజేపీ నేతలు అడుగుతున్నారు.
‘ఎన్నిసార్లు నిజం చెప్పినా ఇలా అడిగేది మానసిక పరిపక్వత లేని వాళ్లయినా అయ్యుండాలి. లేదా చాలా దారుణమైన, నీచమైన ఆలోచన ఉన్నవాళ్లయినా అయ్యుండాలి. అసలు ఇలా అడగడం వెనుక రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు’ అని బీజేపీ నేత తుహిన్ సిన్హా అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో రావడంపై కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.






