- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలుషిత నీరు అందించేదే స్మార్ట్ సిటీనా? రాహుల్ విమర్శలు
ఇండోర్‌లో కలుషిత నీరు తాగిన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. స్మార్ట్ సిటీ ఇదేనా? అంటూ విమర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి ఆస్పత్రిపాలైన వారిని, బాధిత కుటుంబాలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. ఇండోర్‌లో డ్రెయిన్ పైప్ పగిలి తాగునీటితో ఆ నీరు కలవడంతో పలువురు అనారోగ్యం పాలవడంతోపాటు కొందరు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. బాంబే హాస్పిటల్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసిన రాహుల్.. బాధితులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ‘భగీరథ్‌పురాలో కలుషిత నీటి బాధితులను కలిశాను. చాలా మంది చనిపోగా, ఎంతో మంది ఆస్పత్రిపాలయ్యారు. దేశానికి స్మార్ట్ సిటీస్ ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇదేనా ఆ కొత్త మోడల్? కనీసం తాగడానికి శుభ్రమైన నీరులు లేకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తారా?’ అని రాహుల్ నిలదీశారు.
ఇండోర్‌లో శుభ్రమైన నీరు అందుబాటులో లేదని, కలుషిత నీరు తాగి ప్రజలు చనిపోయారని మండిపడ్డారు. ఇదే ఇక్కడి ప్రభుత్వం చూపిస్తున్న అర్బన్ మోడల్ అంటూ విమర్శించారు. ఇది కేవలం ఇండోర్‌లోనే జరగడం లేదని, చాలా సిటీల్లో ఇలాగే జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, బాధితులకు సరైన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో శుభ్రమైన తాగునీరు లభించడం లేదన్న ఆయన.. ప్రతిపక్ష నేతగా వారి గొంతులు వినిపిచేందుకే వచ్చానని చెప్పారు. తాను బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సమయంలో రాహుల్ వెంట మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జీతూ పట్వారీ, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ తదితరులు ఉన్నారు. పోలీసులు రాహుల్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, కలుషిత నీటి వల్ల కనీసం 24 మంది చనిపోయారని స్థానికులు చెప్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7 మరణాలే కలుషిత నీరు వల్ల జరిగాయని, మృతుల్లో ఐదు నెలల పసికందు కూడా ఉందని వెల్లడించింది. అదే సమయంలో ప్రభుత్వం నడిపే మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ వేసిన కమిటీ కలుషిత నీరు వల్ల 15 మంది మరణించినట్లు గుర్తించింది.






