ఈసీ చీటింగ్ చేస్తోంది.. మా దగ్గర ఆధారాలున్నాయి: రాహుల్ గాంధీ

by Phanindra |

ఈసీ చీటింగ్ చేస్తోందని, తమ దగ్గర ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో తమకు ఈసీ దొరికిపోయిందన్నారు.

ఈసీ చీటింగ్ చేస్తోంది.. మా దగ్గర ఆధారాలున్నాయి: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల సంఘం చీటింగ్ చేస్తోందంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. పార్లమెంటు వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ లిస్టు రివిజన్‌పై కూడా ఆయన మండిపడ్డారు.

ఈ విషయంలో ఈసీ చెప్తున్న కారణాలు ఏమాత్రం సరిగాలేవని, ఎన్నికల సంఘం తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఎన్నికలను మానిప్యులేట్ చేసి తప్పించుకోగలమని ఈసీ అనుకుంటే పొరబాటేనని, తాము ఈ విషయాన్ని ఏమాత్రం వదలబోమని ఆయన స్పష్టంచేశారు.

ఎన్నికల సంఘం ఇలా ఫ్రాడ్ చేస్తున్నట్లు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ‘కర్ణాటకలోని ఒక సీటులో ఈసీ కనుసన్నల్లోనే చీటింగ్ జరిగింది. దీనికి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి’ అని రాహుల్ చెప్పారు.

కేవలం ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని తప్పులు జరిగితే, మిగతా సీట్లలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన నిలదీశారు. 45 నుంచి 65 ఏళ్ల వయసున్న వేలాది ఓట్లను కొత్తగా చేరుస్తున్నారని, వాళ్లను ఇప్పుడు తాము పట్టుకున్నామని రాహుల్ చెప్పారు.

అన్నీ నిరాధార ఆరోపణలే: ఈసీ

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. తాము చీటింగ్ చేశామనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పిన ఈసీ అధికారులు.. కర్ణాటక నియోజకవర్గంలో తప్పులు జరిగాయన్న కేసు హైకోర్టులో ఉందని, ఆ తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని, అప్పుడే అసలు నిజం బయటకు వస్తుందని హితవు పలికారు.

అలాకాకుండా ఇలా నిరాధార ఆరోపణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ‘ఈ విషయంపై ఎలక్షన్ పిటిషన్ వేశారు. హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇప్పుడు ఏమాత్రం ఆధారాలు లేకుండా ఈ ఆరోపణలు చేయడం ఎందుకు?’ అని ఈసీ అడిగింది.

Next Story