'SIR' ఎక్కడ ఉంటే అక్కడ ఓట్ల చోరీ.. గుజరాత్‌లో ఓట్ల తొలగింపుపై రాహుల్ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లక్ష్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

SIR ఎక్కడ ఉంటే అక్కడ ఓట్ల చోరీ.. గుజరాత్‌లో ఓట్ల తొలగింపుపై రాహుల్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లక్ష్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 'SIR' (Special Investment Region) అమలులో ఉన్న ప్రాంతాల్లో ఓట్ల చోరీ జరుగుతోందని మరోసారి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన ఒక ఘాటు ప్రకటన విడుదల చేశారు. గుజరాత్ రాష్ట్రంలో SIR పేరుతో జరుగుతున్నది కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియ కాదని, అది ముందస్తు ప్రణాళికతో సాగుతున్న "వ్యూహాత్మక ఓట్ల చోరీ" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకే పేరుతో వేల సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓట్లను తొలగించడం అత్యంత దిగ్భ్రాంతికరమని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే తరహా ప్యాటర్న్..

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న బూత్‌లను, కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎక్కడైతే బీజేపీకి ఓటమి భయం పట్టుకుంటుందో, అక్కడ ఓటర్లనే వ్యవస్థ నుండి మాయం చేస్తున్నారని, గతంలో ఆలంద్, రాజురా నియోజకవర్గాల్లో కనిపించిన ఇదే తరహా ప్యాటర్న్.. ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్‌లతో పాటు SIR అమలులో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన 'ఒక వ్యక్తి - ఒక ఓటు' అనే హక్కును కాలరాయడానికి SIR ను ఒక ఆయుధంగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు కాకుండా, తామే అధికారంలో ఉండాలని బీజేపీ నిర్ణయించుకునేలా ఈ కుట్ర సాగుతోందని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ప్రజాస్వామ్యానికి రక్షకుడిగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు ఈ ఓట్ల చోరీ కుట్రలో ప్రధాన భాగస్వామిగా (Collaborator) మారిపోయిందని ఆయన ఆరోపించారు.

Next Story