- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయులపై పెరుగుతున్న విద్వేష దాడులు!
విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఒకే రోజున ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో భారతీయులపై దారుణమైన దాడులు జరిగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఐర్లాండ్, ఆస్ట్రేలియాల్లో ఒకేరోజు భారతీయులపై దాడులు జరిగింది. డబ్లిన్‌లో 40 ఏళ్ల భారత సంతతి వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేశారు. దుస్తులు విప్పి, దారుణంగా కొట్టి, రక్తమోడుతున్న అతన్ని రోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి సదరు వ్యక్తిని చూసి ఆస్పత్రిలో చేర్పించడంతో అతని ప్రాణాలకు ముప్పుతప్పింది.
జులై 19న జరిగిన ఈ ఘటన స్థానిక భారతీయుల్లో ఆందోళన పెంచింది. సరిగ్గా అదే రోజు ఆస్ట్రేలియాలో జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ 23 ఏళ్ల భారత విద్యార్థిపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. పదునైన ఆయుధంతో అతనిపై పలుమార్లు దాడి చేయడంతో బ్రెయిన్ ట్రామా, మొఖంపై తీవ్రమైన దెబ్బలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సదరు విద్యార్థి.
ఐదేళ్లలో 91 దాడులు.. 30 మరణాలు..
ఈ రెండే కాదు, గత ఐదేళ్లలో వివిధ దేశాల్లో భారతీయులపై జరిగిన జాత్యహంకార దాడుల వివరాలను ఏప్రిల్ నెలలో విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం, ఐదేళ్లలో విదేశాల్లో భారతీయులపై 91 దాడులు జరగ్గా.. వాటిలో 30 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. కెనడాలో అత్యధికంగా 27 దాడుల్లో 16 మంది భారతీయులు కన్నుమూశారు. యూఎస్‌లో 9 దాడులు జరగ్గా.. 9 మంది చనిపోయారు. రష్యాలో 15 దాడులు, యూకేలో 12 దాడులు, జర్మనీలో 11 దాడులు జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ముఖ్యంగా గత రెండేళ్లలో ఈ దాడులు మరీ భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. 2020లో విదేశాల్లో ముగ్గురు భారత విద్యార్థులపై దాడులు జరగ్గా.. ఆ సంఖ్య 2021లో రెండుకు చేరింది. 2022లో ఇలాంటివి నాలుగు ఘటనలు జరిగాయి. సడెన్‌గా 2023లో ఈ ఘటన సంఖ్య 28కి చేరింది. 2024లో ఈ సంఖ్య 40కి చేరడం గమనార్హం.






